కేబీఆర్ పార్కులో ఘనంగా పీకాక్ ఫెస్టివల్... నెమలి వేషధారణలోఅలరించిన చిన్నారులు

కేబీఆర్ పార్కులో ఘనంగా పీకాక్ ఫెస్టివల్...  నెమలి వేషధారణలోఅలరించిన చిన్నారులు

జూబ్లీహిల్స్ , వెలుగు: హైదరాబాద్ మహానగరంలో కేబీఆర్ పార్క్ లాంటి విశాలమైన జీవవైవిధ్య ప్రాంతం ఉండడం సిటీకి ఎంతో మేలు చేస్తుందని అటవీ దలాల సంరక్షణ అధికారి డాక్టర్ సి. సువర్ణ అన్నారు. పార్క్​లో గురువారం పీకాక్ ఫెస్టివల్​ను ఘనంగా నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. పార్క్​లో నెమళ్ల సంరక్షణకు సందర్శకులు సహకరించాలని, ప్లాస్టిక్ సీసాలు, ఆహార ప్యాకెట్లు పడేయకూడదని సూచించారు.  

వన్యప్రాణులకు ఆహారం పెట్టడం, ఫ్లాష్ లైట్​లతో ఫొటోలు తీయడం వంటివి పూర్తిగా మానుకోవాలని కోరారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా, చిన్నారులు నెమలి వేషధారణలో నృత్యాలు ప్రదర్శించి అలరించారు. విజేతలకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. 

కార్యక్రమంలో సీసీఎఫ్ ప్రియాంక వర్గీస్, రామలింగం, హైదరాబాద్ డీఎఫ్ఓ శ్రీనివాస్ తదితర అటవీ ఉన్నతాధికారులు, సిబ్బంది, 
వలంటీర్లు పాల్గొన్నారు.