న్యూఢిల్లీ, వెలుగు: కేంద్రంలోని బీజేపీ సర్కారు విధానాలతోనే రూపాయి బలహీనపడిందని రాజ్యసభ ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే అన్నారు. ప్రపంచంలో భారత కరెన్సీకి విలువ లేకుండా పోయిందని పేర్కొన్నారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ అత్యంత కనిష్ట స్థాయికి పడిపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రూపాయి పతనం అవుతుంటే ప్రధాని మోదీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
గురువారం పార్లమెంట్ ఆవరణలో ఖర్గే మీడియాతో మాట్లాడారు. ‘వారి విధానం బాగుంటే.. రూపాయి విలువ పెరిగి ఉండేది. ఇది మన ఆర్థిక పరిస్థితి బాగా లేదని చూపిస్తున్నది. మనం ఏది కావాలంటే అది చెప్పుకోవచ్చు.. మనల్ని మనం అభినందించుకోవచ్చు.. కానీ రూపాయికి ప్రపంచంలో విలువ పడిపోతున్నది. డాలర్‌తో పోల్చితే నేడు రూపాయి విలువ 90 దాటింది.
మోదీ సర్కారు విధానాలు సరైనవి అయితే.. రూపాయి పడిపోయేది కాదు” అని వ్యాఖ్యానించారు. యూపీఏ హయాంలో 2014 కి ముందు రూపాయి విలువ ఎందుకు పడిపోతున్నదని బీజేపీ ప్రశ్నించిందని, ఇప్పుడు దేశం వారినుంచి సమాధానాలు కోరుతున్నదని అన్నారు.
