‘సారథి’ సేవల్లో సాంకేతిక సమస్య : మంత్రి పొన్నం

‘సారథి’ సేవల్లో సాంకేతిక సమస్య : మంత్రి పొన్నం
  •     రెండు రోజుల్లోనే 10 వేల లైసెన్సుల జారీపై ప్రభావం
  •     రవాణా శాఖ అధికారులతో మంత్రి పొన్నం సమీక్ష
  •     గురువారం సాయంత్రం తర్వాత యథావిధిగా పనిచేసిన పోర్టల్ 

హైదరాబాద్, వెలుగు: కేంద్రానికి చెందిన పోర్టల్  ‘సారథి’ గత 2 రోజుల పాటు పనిచేయకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా వివిధ రకాల లైసెన్స్ ల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. అన్ని జిల్లాల్లోని ఆర్టీఏ కార్యాలయాల్లో బుధ, గురువారాల్లో ఈ పోర్టల్  పనిచేయలేదు. దాంతో కొత్త డ్రైవింగ్ లైసెన్స్ ల జారీ, వాటి రెన్యువల్స్ వంటి సేవలు నిలిచిపోయాయి. పోర్టల్ లోని సాంకేతిక సమస్య ఢిల్లీలోనే ఏర్పడిందని గుర్తించిన ఇక్కడి అధికారులు.. అక్కడి అధికారులను సమస్యను వివరించారు.

 చివరకు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఆ శాఖ స్పెషల్  చీఫ్  సెక్రటరీ వికాస్ రాజ్ , ఇతర ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితిని ఆరా తీశారు. త్వరగా సమస్య పరిష్కారం అయ్యేలా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రవాణా శాఖ కేంద్ర కార్యాలయమైన హైదరాబాద్ లోని ఖైరతాబాద్  ఆఫీసులో వందలాది మంది గత రెండు రోజులుగా తమ లైసెన్సుల కోసం నిరీక్షించారు. 

అయితే,గురువారం సాయంత్రం తర్వాత సారథి పోర్టల్ లో సాంకేతిక సమస్య తొలగిపోయిందని ఆర్టీఏ అధికారులు చెప్పారు. శుక్రవారం నుంచి ఈ పోర్టల్ సేవలు యదావిధిగా కొనసాగనున్నాయని వారు ప్రకటించారు.