తాడ్వాయి, వెలుగు : మేడారం మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలను ఒకే వరుస క్రమంలో నిర్మిస్తున్నారు. ఈ మేరకు గురువారం గోవిందరాజుల గద్దెను కదిలించారు. ఇందులో భాగంగా కొండాయి గ్రామానికి చెందిన దబ్బకట్ల వంశీయుల ప్రధాన పూజారి దబ్బకట్ల గోవర్ధన్ ఆధ్వర్యంలో డోలు వాయిద్యాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం గోవిందరాజుల గద్దెను మూడు సార్లు కదిలించి మట్టిని సేకరించి కొత్త వస్త్రంలో మూట కట్టారు. ఈ నెల 24న కొత్తగా నిర్మిస్తున్న గద్దెలో ఈ మట్టిని వేసి స్తంభాలను ప్రతిష్ఠించనున్నట్లు పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, ఉపాధ్యక్షురాలు సరళమ్మ, పూజారి కాక సారయ్య, ప్రధాన కార్యదర్శి చంద గోపాల్‌రావు తెలిపారు.
మాస్టర్ ప్లాన్ పనులను పరిశీలించిన మంత్రి
మేడారంలో చేపట్టిన మాస్టర్ ప్లాన్ పనులను నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలని మంత్రి సీతక్క సూచించారు. గురువారం వనదేవతలను దర్శనం చేసుకున్న అనంతరం మాస్టర్ ప్లాన్ పనులను పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతర సమయం దగ్గర పడుతున్నందున అభివృద్ధి పనులను స్పీడప్ చేయాలని ఆదేశించారు. మంత్రి వెంట లైబ్రరీ చైర్మన్ బాణోత్ రవిచందర్, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్ కుమార్ ఉన్నారు.
