- రోజులు ఒకేలా ఉండవు: కేటీఆర్
- కాంగ్రెస్ హత్యా రాజకీయాలు చేస్తోందని ఆరోపణ
- బీఆర్ఎస్ కార్యకర్త మల్లయ్య కుటుంబానికి పరామర్శ
తుంగతుర్తి, వెలుగు: సర్పంచ్ ఎన్నికలకు భయపడి కాంగ్రెస్ హత్యా రాజకీయాలు చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు కొనసాగిస్తే, తాము కూడా తిరగబడతామని, అదే జరిగితే రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పి పరిస్థితి చేయి దాటిపోతుందని హెచ్చరించారు.
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం లింగంపల్లి గ్రామంలో హత్యకు గురైన బీఆర్ఎస్ కార్యకర్త ఉప్పల మల్లయ్య కుటుంబాన్ని కేటీఆర్ ఆదివారం పరామర్శించారు. మల్లయ్య ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేసి మాట్లాడారు. మల్లయ్య కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
పంచాయతీ ఎన్నికలకే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతగా భయపడుతోందన్నారు. ‘‘రెండేళ్లలో అద్భుతాలు చేశామని, రుణమాఫీ, ఇళ్లు, రేషన్ కార్డులు ఇచ్చామని కాంగ్రెస్ చెబుతున్న మాటలు నిజమే అయితే ఎందుకు భయపడుతున్నారు? ఇచ్చిన హామీలు అమలు చేసి ఉంటే ప్రజలే బ్రహ్మరథం పట్టేవారు. కానీ, వైఫల్యాల భయంతోనే కాంగ్రెస్ నేతలు దాడులు, దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. పదేళ్లు మేము అధికారంలో ఉన్నాం. ఏనాడూ మీలాగా ఆలోచించలేదు.
మేము కూడా మీలాగే ఆలోచించి ఉంటే ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలకు ఈ పరిస్థితి ఉండేదా?’’ అని కేటీఆర్ ప్రశ్నించారు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవని, కాంగ్రెస్ నేతలు ఇప్పటికైనా దిక్కుమాలిన రాజకీయాలు మాని, ప్రజలకు మంచి చేయడంపై దృష్టి పెట్టాలన్నారు. తమ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందని, బాధిత మల్లయ్య కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు.
కాంగ్రెస్ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నా, ధైర్యంతో పోరాడి సుమారు 50 శాతం సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలను కైవసం చేసుకున్న కార్యకర్తలను ఆయన అభినందించారు. కేటీఆర్ వెంట మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ తదితరులు ఉన్నారు.
