ఫ్లైఓవర్​కు జాగా ఇవ్వండి: అమిత్​షాకు కేటీఆర్ విజ్ఞప్తి

ఫ్లైఓవర్​కు జాగా ఇవ్వండి: అమిత్​షాకు కేటీఆర్ విజ్ఞప్తి
  • ఇంటర్ స్టేట్ పోలీస్ క్వార్టర్స్ పరిధిలోని భూమి బదలాయించండి
  • రైల్వే మంత్రి​తోనూ భేటీ ఫార్మా సిటీకి రూ.3,718 కోట్లు ఇవ్వండి
  • విజయవాడ-హైదరాబాద్ ప్యాసింజర్ రైలుకు విజ్ఞప్తి

న్యూఢిల్లీ, వెలుగు:

హైదరాబాద్ రసూల్ పుర కూడలిలో ఫ్లై ఓవర్ నిర్మాణానికి ఇంటర్ స్టేట్ పోలీస్ క్వార్టర్స్ పరిధిలోని స్థలాన్ని కేటాయించాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్​షాను మంత్రి కేటీఆర్ కోరారు. గురువారం ఢిల్లీలో నార్త్ బ్లాక్ లో అమిత్​షాతో భేటీ అయిన కేటీఆర్.. పలు అంశాలపై వినతి పత్రం అందజేశారు. 1.62 ఎకరాల స్థలాన్ని జీహెచ్ఎంసీకి బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. భూ కేటాయింపులపై గతంలో చేసిన విజ్ఞప్తిని కేంద్ర హోం శాఖ తిరస్కరించిందని చెప్పారు. ‘‘జాయింట్ సెక్రటరీ ఎంఎస్ స్వామి నేతృత్వంలో వేసిన కమిటీ ఆ స్థలాన్ని పరిశీలించింది. ప్రస్తుతం ఆ భూమిలో కేవలం 15 మంది సిబ్బంది నివాసాలు, సెక్యూరిటీ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ స్టోర్ రూమ్ మాత్రమే ఉన్నాయని రిపోర్ట్ ఇచ్చింది. మీరిచ్చే భూమికి బదులుగా మరో చోట జీహెచ్ఎంసీ భూమి కేటాయించి, నిర్మాణాలు చేపట్టి ఇస్తుంది” అని వివరించారు.

ఫార్మా సిటీకి సాయం చేయండి

కేంద్ర పరిశ్రమలు, రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో కూడా కేటీఆర్ భేటీ అయ్యారు. హైదరాబాద్ ఫార్మా సిటీ లో మౌలిక సదుపాయాల కోసం రూ.3,718 కోట్ల ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్, వరంగల్ మధ్య పారిశ్రామిక ప్రాంతంగా ఉన్న హెచ్ఐసీసీలో రహదారులు, నీటి సరఫరా,  ఎయిర్ స్ట్రిప్స్ కు 1,318 కోట్లు, అంతర్గత వసతులకు 2,100 కోట్లు ఇవ్వాలని కోరారు. ఖమ్మం జిల్లాలోని గ్రానైట్ పరిశ్రమల నుంచి గ్రానైట్ ఎగుమతి చేసేందుకు వీలుగా ఖమ్మం పందిళ్లపల్లి రైల్వే స్టేషన్ లో రైల్వే వసతి కల్పించాలని కోరారు.

‘విజయవాడ-హైదరాబాద్’ ప్యాసింజర్ నడపండి

విజయవాడ నుంచి నల్గొండ, హైదరాబాద్ వరకు ప్యాసింజర్ రైలు నడపాలని కేంద్ర మంత్రి గోయల్​ను కేటీఆర్ కోరారు. హైదరాబాద్ లో నేషనల్ డిజైన్ సెంటర్ కు ఇప్పటికే భూ కేటాయింపు పూర్తయిందని తెలిపారు. ఎన్డీసీ తో కలిసి పని చేసేందుకు దేశ, విదేశాల్లోని దిగ్గజ సంస్థలు ఆసక్తి చూపుతుననాయని, వెంటనే తుది అనుమతులు ఇవ్వాలని కోరారు.

KTR appeal to Amit Shah to Construction of a proposed flyover at Rasoolpur