
- గ్రాడ్యుయేట్ ఓటర్లకు కేటీఆర్ విజ్ఞప్తి
- ఖమ్మం, నల్గొండ, వరంగల్ నేతలతో సమీక్ష
- ఎంపీ ఎన్నికల్లో ఏడు స్థానాల్లో గెలుస్తున్నామని ధీమా
- ఏపీలో జగన్ గెలుస్తాడని సమాచారం ఉందని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ నెరవేరాలంటే.. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వ్యక్తి ఎమ్మెల్సీగా ఎన్నికవ్వాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకగా ఉండే బీఆర్‌ఎస్ క్యాండిడేట్‌ను గ్రాడ్యుయేట్ఉప ఎన్నికలో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు రాష్ట్రానికి కావాల్సింది అధికార స్వరాలు కాదని, ధిక్కార స్వరాలు కావాలన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల నాయకులతో కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గత నాలుగుసార్లు తమకు అవకాశమిచ్చారని.. గతంలో గెలిచిన వాళ్లంతా ప్రభుత్వాన్ని ప్రశ్నించి, గ్రాడ్యుయేట్స్ కోసం కొట్లాడారని చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్‌ను ప్రశ్నించేందుకు తమ అభ్యర్థి రాకేశ్ రెడ్డిని గెలిపించాలని కోరారు. గెలిచిన ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని రేవంత్ రెడ్డి మాట ఇచ్చారని, ఆ గడువుకు ఇంకో ఏడు నెలలే మిగిలి ఉందన్నారు.
రైతులకు అండగా ఉంటాం
రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడం.. అధికారులు పట్టించుకోకపోవడంతో రైతులు దయనీయ పరిస్థితుల్లో ఉన్నారని కేటీఆర్ అన్నారు. చాలా చోట్ల గత 25, 30 రోజుల క్రితమే ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చినా కొనడం లేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రాజకీయాలను పక్కనబెట్టి వడ్లు కొనుగోలు చేయాలన్నారు. తడిసిన ధాన్యాన్ని కూడా కొనాలన్నారు. తరుగు విషయంలో కాంగ్రెస్ నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమేమీ మాట్లాడారో సామాజిక మాధ్యమాల్లో ఉందని గుర్తుచేశారు. ప్రస్తుతం క్వింటాల్‌కు మూడు, మూడున్నర కిలోల తరుగు తీసేస్తున్నారని ఆరోపించారు. ఆనాడు వాళ్లు చెప్పిన దాని ప్రకారం.. రైతుకు అన్యాయం చేయకుండా.. తరుగు లేకుండా ధాన్యం కొనాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రైతులు ఎప్పుడు పిలిచినా.. ఎక్కడికి పిలిచినా వస్తామన్నారు.
ఉద్యోగులను పదేండ్లలో ఒక్క మాట అనలేదు
తమ పదేండ్ల పాలనలో కేసీఆర్ ఒక్కనాడు కూడా ప్రభుత్వ ఉద్యోగులను ఒక పొల్లు మాట కూడా అనలేదని కేటీఆర్ అన్నారు. వాళ్లతో తమకు పేగు బంధం ఉందన్నారు. ఉద్యోగుల పట్ల కుదిరితే ప్రేమపూర్వకంగా ఉన్నాం తప్ప నిందించలేదన్నారు. అదే రేవంత్ రెడ్డి తన అసమర్థతను, తన ప్రభుత్వ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు విద్యుత్ సంస్థ ఉద్యోగులను నిందిస్తున్నారని ఆయన విమర్శించారు. నారాయణఖేడ్‌లో టీచర్ల మీద పోలీసుల లాఠీ చార్జీని ఖండిస్తున్నామన్నారు.
ఎంపీ ఎన్నికల్లో మేమే గెలుస్తున్నాం
ప్రెస్‌మీట్ అనంతరం జర్నలిస్టులతో కేటీఆర్ చిట్ చాట్ చేశారు. ఎంపీ ఎన్నికలపై తాను ప్రత్యేకంగా సర్వే చేయించానని, తమ పార్టీ అత్యధిక సీట్లు గెలవబోతున్నట్టు సర్వేలో తేలిందని వెల్లడించారు. కాంగ్రెస్ నల్గొండలో మాత్రమే గెలుస్తుందన్నారు. నాగర్ కర్నూల్, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, కరీంనగర్, ఖమ్మం, మెదక్, చేవెళ్లలో బీఆర్‌ఎస్ గెలుస్తోందని చెప్పారు. పెద్దపల్లి, ఆదిలాబాద్, నిజామాబాద్‌లో బీఆర్‌ఎస్ వర్సెస్ బీజేపీగా ఉందన్నారు. ఈ ఎన్నికల్లో డబ్బు ప్రభావం చూపిస్తుందని తాను అనుకోవడం లేదన్నారు. సిరిసిల్లలో ఒక్క రూపాయి పంచకుండానే, తాను ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందానన్నారు. ఏపీలో జగన్ గెలుస్తున్నారని తమకు సమాచారం అందిందని కేటీఆర్ స్పష్టం చేశారు.
మీటింగ్‌కు ముఖ్య నేతల డుమ్మా
కేటీఆర్ నిర్వహించిన సమీక్ష సమావేశానికి ఆ పార్టీకి చెందిన పలువురు ముఖ్యనాయకులు డుమ్మా కొట్టారు. మాజీ ఎమ్మెల్యేలు సైతం గైర్హాజరయ్యారు. సుమారు 130 మందిని సమావేశానికి పిలిస్తే, అందులో మూడోవంతు రాలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకపోవడం వల్లే వారు అసంతృప్తిగా ఉన్నట్టు చెప్తున్నారు. రాకేశ్‌రెడ్డి.. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అనుచరుడు కావడం.. ఆయన సూచనల మేరకే అతనికి సీటు ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. దీంతో రాకేశ్‌రెడ్డికి సహకరించేందుకు నాయకులు ముందుకు రావడం లేదని చెప్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్ రావు, నల్లమోతు భాస్కర్‌రావు, గొంగిడి సునీత, రెడ్యానాయక్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, గండ్ర వెంకటరమణా రెడ్డి, కందాల ఉపేందర్ రెడ్డి, బానోతు మదన్‌లాల్, సండ్ర వెంకట వీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు తదితరులు మీటింగ్‌కు రాలేదు.