టీబీజీకేఎస్లో కవితకు చెక్!..సంఘం ఇన్చార్జిగా కొప్పుల

టీబీజీకేఎస్లో కవితకు చెక్!..సంఘం ఇన్చార్జిగా కొప్పుల
  • సంఘం ఇన్​చార్జిగా కొప్పులను నియమించిన కేటీఆర్
  • ఇకపై సంఘం కార్యకలాపాలన్నీ పార్టీకి అనుబంధంగానే జరగాలని ఆదేశాలు
  • పదేండ్లుగా గౌరవ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న కవిత

హైదరాబాద్/గోదావరిఖని, వెలుగు: తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్​) ఇన్​చార్జ్​గా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్​ను కేటీఆర్ నియమించారు. బుధవారం తెలంగాణ భవన్​లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో జరిగిన టీబీజీకేఎస్ సమావేశంలో ఈ  నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఆ సంఘం బీఆర్ఎస్​కు అనుబంధంగానే పనిచేయాలని కేటీఆర్​ఆదేశించారు. సంఘం ఏ కార్యక్రమం చేసినా పార్టీకి అనుబంధంగానే చేయాలని స్పష్టంచేసినట్లు సమాచారం. 

అయితే, టీబీజీకేఎస్​కు గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను తప్పించినట్లు తెలుస్తున్నది. సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు, ఇన్​చార్జ్​లు, మాజీ మంత్రులతో సమన్వయం చేసుకోవాలని కేటీఆర్ ఆదేశించినట్లు టీబీజీకేఎస్ వర్గాలు చెప్తున్నాయి. కేంద్రం అవలంబిస్తున్న విధానాలపై ‘సేవ్ సింగరేణి’ పేరుతో కార్యక్రమాలను నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించినట్టు తెలిసింది. 

మరోవైపు సంఘం ఎన్నికలను సెప్టెంబర్​లో నిర్వహించే అంశంపైనా సమావేశంలో చర్చకు వచ్చినట్లు చెప్తున్నారు. సంఘం ఎన్నికలు జరిగి రెండేండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో.. కొత్త కార్యవర్గం ఎన్నికలపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

టీబీజీకేఎస్​తో కవితకు పదేండ్ల అనుబంధం

తెలంగాణ ఏర్పాటు తర్వాత 2014  నుంచి టీబీజీకేఎస్ యూనియన్ గౌరవాధ్యక్షురాలిగా కవిత వ్యవహరిస్తున్నారు. ఈ పదేండ్ల కాలంలో పార్టీకి, యూనియన్​కు మధ్య కవిత అనుసంధాకర్తగా ఉంటూ దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్​ ఓటమి తర్వాత టీబీజీకేఎస్​ కీలక నేతలు రాజీనామా చేయడంతో 2023, డిసెంబర్​లో జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఆ సంఘం పోటీ చేయలేదు. దీంతో కవిత యూనియన్​ కార్యకలాపాలకు కాస్త దూరమయ్యారు. 

ఈలోగా బీఆర్ఎస్లో జరిగిన పరిణామాల నేపథ్యంలో కవిత తన సొంత సైన్యాన్ని పెంచుకోవడంలో భాగంగా తెలంగాణ జాగృతికి అనుబంధంగా ‘సింగరేణి జాగృతి’ పేరుతో కమిటీలను వేసి సింగరేణిలో కార్యకలాపాలకు పిలుపునిచ్చారు.