
హుస్సేన్ సాగర్ తీరంలో ఇండియన్ రేసింగ్ లీగ్ గ్రాండ్గా మొదలైంది. మంత్రి కేటీఆర్ జెండా ఊపి రేసును ప్రారంభించారు. ఈ రేసింగ్ లో పాల్గొన్న తెలుగు తేజం మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కొడుకు అనిందిత్ రెడ్డికి మంత్రి కేటీఆర్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ కార్యక్రమానికి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, హీరో నిఖిల్ కూడా హాజరయ్యారు.
హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ టీమ్ నుంచి కొండా అనిందిత్ రెడ్డి బరిలో ఉన్నాడు. యువ రేసర్ అనిందిత్ రెడ్డికి రేసింగ్ లో ఏడేళ్ల అనుభవం ఉంది. 2016లో యూరో JK16 ఛాంపియన్ షిప్, 2017లో యూరో జేకే ఛాంపియన్ షిప్ లలో విన్నర్ గా నిలిచాడు. అంతేగాకుండా మోటార్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియా 2017 మోటార్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ను కూడా గెలుచుకున్నాడు.
ఫార్ములా ఈ రేసు దేశంలోనే తొలిసారి హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ సహా ఆరు జట్లు పాల్గొంటున్నాయి. ఆరు జట్ల నుంచి 12 కార్లు.. 24 మంది డ్రైవర్లు రేస్లో ఉన్నారు. ఈ పోటీలను రేసింగ్ ప్రమోషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ... అంతర్జాతీయ ఆటోమొబైల్ ఫెడరేషన్ నిర్వహిస్తున్నాయి.
లీగ్ ఫార్మాట్ ప్రకారం పోటీలు 4 రౌండ్లలో జరగనున్నాయి. ఫస్ట్ అండ్ లాస్ట్ రౌండ్లకు హైదరాబాద్ ఆతిథ్యం ఇస్తుండగా.... 2, 3 రౌండ్లు చెన్నైలో కొనసాగనున్నాయి. ప్రతి రౌండ్ రెండ్రోజుల పాటు జరగనుంది. ఈ రోజు పోల్ పొజిషన్ కోసం క్వాలిఫయింగ్ రేస్ జరగనుండగా... ఆదివారం 3 స్ర్పింట్ రేసులు నిర్వహించనున్నారు. మూడు స్ర్పింట్ రేసుల్లో టాపర్గా నిలిచిన జట్టుకు 25 పాయింట్లు లభిస్తాయి. రెండో స్థానంలోని జట్టుకు 18, మూడో స్థానంలోని టీమ్ కు 15 పాయింట్లు లభిస్తాయి.