
న్యూఢిల్లీ/హైదరాబాద్, వెలుగు: అమృత్ స్కీంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ –టెండర్ల వివరాలను బహిర్గతం చేయాలని కేంద్రాన్ని కేటీఆర్ కోరారు. నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు జరిగితే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం ఢిల్లీలో ఎంపీలు వద్దిరాజు, దామోదరరావు, సురేశ్ రెడ్డి, మాజీ ఎంపీలతో కలిసి కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో కేటీఆర్ భేటీ అయ్యారు. అమృత్ టెండర్లలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ 4 పేజీల కంప్లయింట్ లెటర్ ను కేంద్రమంత్రికి అందజేశారు.
అమృత్ 2.0 స్కీం లో భాగంగా తెలంగాణలో కేంద్రం వివిధ పనులకు దాదాపు రూ. 8,888 కోట్లు ఖర్చు చేస్తున్నదని గుర్తు చేశారు. ఇందులో సీఎం అవినీతికి పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే నిబంధనను ఉల్లంఘించి, తన బామ్మర్ది సుజన్ రెడ్డికి చెందిన శోధా కంపెనీకి రూ. 1,137 కోట్ల విలువ చేసే పనులను అప్పగించారని పేర్కొన్నారు. తన బామ్మర్ది కంపెనీ అనే ఒక్క కారణంతోనే పనులను కట్టబెట్టారని ఆరోపించారు. ఆ కంపెనీ 2021–2022 ఫైనాన్షియల్ ఇయర్ లో కేవలం రూ. 2 .20 కోట్ల లాభాన్ని మాత్రమే చూపించిందని పేర్కొన్నారు. అలాంటి కంపెనీకి రూ. 1,137 కోట్ల పనులు అప్పజెప్పారని అడిగారు. పురపాలక శాఖ మంత్రిగానూ ఉన్న రేవంత్ రెడ్డి అమృత్ టెండర్లను తన బామ్మర్దికి అప్పగించడం ద్వారా భారీ అవినీతికి పాల్పడ్డాడని కేటీఆర్ ఆరోపించారు.
ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్
కాంగ్రెస్ నేతలు ప్రేమ దుకాణమంటూ అన్నీ విద్వేషాలు వ్యాప్తి చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ హయాంలో ఒక్క గంట కూడా కర్ఫ్యూ విధించాల్సిన పరిస్థితి రాలేదని, కానీ ఇప్పుడు దసరా, దీపావళి వేళ నెల మొత్తం కర్ఫ్యూ విధించారని తెలిపారు. అందుకే కేసీఆర్ ఎక్కడ..సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ? అని విమర్శించారు. వరంగల్ ప్రజలు ఇంకా నాలుగేళ్లు ఈ ప్రభుత్వాన్ని భరించాలా అని బాధపడుతున్నారన్నారు. సోమవారం తెలంగాణ భవన్‌లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. సమాజాన్ని కేసీఆర్ ఎప్పుడూ మతపరంగా, ఓట్లపరంగా చూడలేదన్నారు. బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫా, క్రిస్ మస్ కానుకలు ఇచ్చారన్నారు.
"మన పిల్లలకు మంచి విద్యను అందిస్తే రాష్ట్ర భవిష్యత్ అంత బాగుంటుందని కేసీఆర్ నమ్మారు. 200కు పైగా రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేశారు. దాదాపు 1.4 లక్షల మంది విద్యార్థులపై ఏటా రూ.1.2 లక్షలు ఖర్చు చేశారు. మైనార్టీ గురుకుల స్కూళ్ల నుంచి వచ్చిన విద్యార్థులు దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో చదువుతూ రాష్ట్రం గర్వపడేలా చేస్తున్నారు. మౌలానా అబుల్ కలాం పేరుతో 2, 751 మంది మైనార్టీ విద్యార్థులకు రూ. 20 లక్షలు ఇచ్చారు. దాదాపు రూ. 438 కోట్లు ఖర్చు చేశారు. నాంపల్లిలో 100 కోట్ల రూపాయల విలువ గల 2 ఎకరాలు భూమి కేటాయించి రూ. 40 కోట్లతో అనిసిల్ గుర్బాను నిర్మించారు. మక్కా మసీదు మరమత్తుల కోసం రూ. 9 కోట్లు ఖర్చు చేశారు.
రూ. 10 వేల కోట్లతో మైనార్టీ సంక్షేమం కోసం కృషి చేశారు. షాదీ ముబారక్ పేరుతో ఆడపిల్లల పెళ్లికి రూ. లక్ష ఇచ్చారు. ఇమామ్, మౌలానాలకు నెలకు రూ. 5 వేలు ఇచ్చారు" అని పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్ వాళ్లు మాత్రం ఆరు గ్యారంటీలు, 420 హామీలు వదిలేశారని కేటీఆర్ విమర్శించారు. మూసీ పేరుతో 16 వేల పేదల ఇళ్లను కూలగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.మైనార్టీ డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదన్నారు. సీఎం సొంత నియోజకవర్గంలో కలెక్టర్‌పైనే రైతులు తిరగబడడం రాష్ట్రంలో పాలనా వైఫల్యానికి నిదర్శనమని కేటీఆర్ అన్నారు. సీఎం మూర్ఖత్వం వల్ల అధికారులు దెబ్బలు తినాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. భూసేకరణ పూర్తయ్యి, అన్ని అనుమతులు వచ్చి, ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఫార్మా సిటీని రద్దు చేసి, రాష్ట్రంలో పది చోట్ల ఫార్మా క్లస్టర్లు పెట్టాలనే తుగ్లక్ ఆలోచన వల్లే ఇంత అలజడి రేగిందన్నారు.
అంతలోనే ప్రకంపనలా?
కేసులను తప్పించుకునేందుకే కేటీఆర్ హుటాహుటిన ఢిల్లీ వెళ్లారని రాష్ట్ర మంత్రులు విమర్శించారు. అయితే, దీనిపై కేటీఆర్ స్పందిస్తూ.. ఢిల్లీ లో ల్యాండ్ అయిన వెంటనే సోషల్ మీడియా ‘ఎక్స్ ’ వేదికగా పోస్ట్ పెట్టారు. ‘‘జస్ట్ ఇప్పుడే ఢిల్లీలో ల్యాండ్ అయ్యా. ఇప్పటికే హైదరాబాద్‌లో ప్రకంపనలు వస్తున్నాయని విన్నా.
అప్పుడే వణికిపోతే ఎలా’’ అంటూ ట్వీట్ చేశారు.