5 వేల కోట్లతో జూబ్లీహిల్స్‌‌‌‌ను అభివృద్ధి చేసినం.. గత రెండేండ్లలో మీరేం చేశారు?: కేటీఆర్

5 వేల కోట్లతో జూబ్లీహిల్స్‌‌‌‌ను అభివృద్ధి చేసినం.. గత రెండేండ్లలో మీరేం చేశారు?: కేటీఆర్
  • సీఎం రేవంత్ రెడ్డి.. దమ్ముంటే చర్చకు రా.. 
  • చెత్త ఎవరిదో.. సత్తా ఎవరిదో 
  • తేల్చుకుందామంటూ సవాల్
  • జూబ్లీహిల్స్ ప్రగతి నివేదిక విడుదల

హైదరాబాద్, వెలుగు:బీఆర్ఎస్ హయాంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రూ.5,328 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని ఆ పార్టీ వర్కింగ్ ​ప్రెసిడెంట్ కేటీఆర్ ​తెలిపారు. ఈ పనుల ద్వారా 2,12,862 మంది లబ్ధిదారులకు మేలు జరిగిందని చెప్పారు. గత రెండేండ్లలో కాంగ్రెస్ సర్కార్ చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. ‘‘మేం పదేండ్లలో చేసిన అభివృద్ధి చెప్పినం. మీరు గత రెండేండ్లలో ఏం చేశారో చెప్పండి. దీనిపై చర్చకు నేను రెడీ.. పోలీస్​కమాండ్​ కంట్రోల్​ సెంటర్‌‌‌‌‌‌‌‌కు రమ్మంటవా? లేక గాంధీభవన్‌‌‌‌కు రావాల్నా? లేక ప్రెస్‌‌‌‌క్లబ్‌‌‌‌కు రావాల్నా? అసెంబ్లీలో అయినా చర్చకు నేను సిద్ధం” అని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.

 ‘‘చెత్త ఎవరిదో.. సత్తా ఎవరిదో తేల్చుకుందాం.. రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి నిజాయితీపరుడైతే చర్చకు రావాలి.. డేట్‌‌‌‌‌‌‌‌, టైమ్‌‌‌‌‌‌‌‌, ప్లేస్‌‌‌‌‌‌‌‌ ఆయనే ఫిక్స్‌‌‌‌‌‌‌‌ చేయాలి’’ అని కేటీఆర్​ అన్నారు. బీఆర్ఎస్ హయాంలో జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌లో చేపట్టిన అభివృద్ధి పనులపై ‘జూబ్లీహిల్స్​ప్రగతి నివేదిక’ను బుధవారం (నవంబర్ 05) తెలంగాణ భవన్‌‌‌‌‌‌‌‌లో కేటీఆర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్​ సారథ్యంలో జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌లో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. 

తాము జవాబుదారీతనంతోనే ప్రజలకు ఈ లెక్కలు చెబుతున్నామని, తప్పులుంటే ఎత్తిచూపాలని అన్నారు. ‘‘మేం చేసిన అభివృద్ధిని చూపించి ఓట్లు అడుగుతున్నాం. గత రెండేండ్లలో మీరు ఖర్చు చేసింది ఎంత? ఏ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎంత పెట్టారు? మీరు చేసిన అభివృద్ధిని చెప్పి.. ఓట్లు అడగండి” అని సీఎంని డిమాండ్ చేశారు. 

మెట్రోకు 1,722 కోట్లు

జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌లో 8.5 కిలోమీటర్ల మేర మెట్రో పనుల కోసం రూ.1,722 కోట్లు ఖర్చు చేశామని కేటీఆర్ వెల్లడించారు. ‘‘షేక్‌‌‌‌‌‌‌‌పేట్​ ఫ్లైఓవర్​ కోసం రూ.333 కోట్లు, సీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీ కింద రోడ్ల నిర్మాణం కోసం రూ.408 కోట్లు ఖర్చు చేశాం.  ప్రజారోగ్యానికి రూ.919 కోట్లు వెచ్చించాం.  రూ.324 కోట్లతో 3,600 డబుల్ బెడ్​రూమ్ ఇండ్లు నిర్మించి లబ్ధిదారులకు అందించాం. 

ఒక్కో ఇంటికి అప్పట్లో రూ.9.5 లక్షలు ఖర్చు చేస్తే, ఇప్పుడదే ఇంటి విలువ రూ.90 లక్షలకు పెరిగింది. సామాజిక సంక్షేమం కోసం రూ.705 కోట్లు ఖర్చు చేశాం. ఇందులో 25,905 మందికి ఆసరా పింఛన్ల కోసం రూ.564 కోట్లు, 605 మందికి బీసీ బంధు రూ.6 కోట్లు, అన్నపూర్ణ క్యాంటిన్ల కోసం రూ.2 కోట్లు ఖర్చు చేసినం. విద్యాభివృద్ధి కోసం రూ.87 కోట్లు ఖర్చు చేయగా.. ఇందులో టిమ్రీస్ స్కూల్‌‌‌‌‌‌‌‌కు రూ.51 కోట్లు, బోరబండలో సెంటర్​ఫర్​దళిత్​స్టడీస్ ఏర్పాటుకు​రూ.36 కోట్లు వెచ్చించాం.  10 సబ్​స్టేషన్లు నిర్మాణానికికి రూ.455 కోట్లు, ఫ్రీ కరెంట్‌‌‌‌‌‌‌‌కు రూ.50 కోట్లు, ఇంటింటికి తాగునీరు ఇవ్వడానికి రూ.180 కోట్లతో 15 వేల నల్లా కనెక్షన్లు అందించాం. డ్రైనేజీ సమస్య పరిష్కారానికి ఎస్ఎన్‌‌‌‌‌‌‌‌డీపీ కింద రూ.75 కోట్లు ఖర్చు చేసినం” అని వివరించారు. 

ఐటీ రంగాన్ని నాశనం చేసిన్రు..  

ఐటీ పారిశ్రామికవేత్తలను సీఎం రేవంత్ రెడ్డి బెదిరించడంతో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఐటీ రంగం సర్వనాశనమైందని కేటీఆర్ అన్నారు. ‘‘2014లో కేసీఆర్ అధికారం చేపట్టే నాటికి ఐటీ ఎక్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్స్​విలువ రూ.57 వేల కోట్లు. దాన్ని మేం రూ.2.41 లక్షల కోట్లకు పెంచాం. అలాగే ఐటీ ఉద్యోగాలను 3 లక్షల నుంచి 9.5 లక్షలకు పెంచినం. 24 వేల కొత్త కంపెనీలు తీసుకొచ్చి 24 లక్షల కొత్త ఉద్యోగావకాశాలు సృష్టించినం. కానీ కాంగ్రెస్ హయాంలో సీఎం ఎందరి తలలకు తుపాకులు పెట్టి బెదిరిస్తున్నారో ప్రజలకు తెలుసు.. పారిశ్రామికవేత్తలు ఎందుకు భయపడి పారిపోతున్నరో తెల్వదా..?” అని అన్నారు. 

సీఎం ఇప్పుడు కూర్చొని సమీక్షలు జరుపుతున్న కమాండ్​కంట్రోల్​సెంటర్ తామే కట్టామని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించిపోయానని.. సైబరాబాద్‌‌‌‌‌‌‌‌లో 41 శాతం , హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో 60 శాతం క్రైమ్ రేట్​పెరిగిందని తెలిపారు. గన్​కల్చర్​పాపులర్​ అయిందన్నారు. సీఎం చేతగానితనం వల్లే ముంబై పోలీసులు వచ్చి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో రూ.12 వేల కోట్ల డ్రగ్స్​పట్టుకున్నారని విమర్శించారు. దీంతో రాష్ట్రం పరువు పోయిందన్నారు. 

సీఎం రేవంత్ రెడ్డి 10 వేల కోట్లకు కక్కుర్తి పడి, సెంట్రల్​యూనివర్సిటీ భూముల ఆక్రమణకు ప్రయత్నించి, జీవ వైవిధ్యం కోల్పోయేలా చేశారని ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభిస్తూ.. సీఎం రేవంత్ రెడ్డి కటింగ్ మాస్టర్ అనిపించుకుంటున్నారని విమర్శించారు.