
- రాష్ట్ర ప్రజలపై రూ. 15 వేల కోట్ల భారం: కేటీఆర్
- మైండ్‌స్పేస్- ఎయిర్‌పోర్ట్ వరకు భూమ్మీదనే నిర్మించేలా తాము డిజైన్ చేశామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగత కక్ష సాధింపుల వల్లే మెట్రో ప్రాజెక్టు నుంచి ఎల్ అండ్ టీ వైదొలిగిందని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ‘‘ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయంతో రాష్ట్ర ప్రజలపై ఏకంగా రూ.15 వేల కోట్ల అప్పుల భారం పడింది” అని వ్యాఖ్యానించారు.
మేడిగడ్డ విషయంలో బీఆర్ఎస్ ను బద్నాం చేసే అవకాశం ఇవ్వకుండా, తామే రిపేర్లు చేస్తామని ఎల్ అండ్ టీ ముందుకురావడమే రేవంత్ రెడ్డికి నచ్చలేదని, అప్పటి నుంచే ఆ సంస్థపై కక్షగట్టి రాష్ట్రం విడిచి వెళ్లిపోయేలా చేశారని ఆయన దుయ్యబట్టారు.
శుక్రవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాతనే మెట్రో పనులు వేగంగా జరిగాయని, మూడేండ్లలోనే 2017లో ప్రధాని మోదీ దీన్ని ప్రారంభించారని అన్నారు. తాము అధికారం నుంచి దిగిపోయే ముందు వరకు హైదరాబాద్ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని 400 కిలోమీటర్ల మెట్రో విస్తరణకు ప్రణాళికలు రచించామని, ఓఆర్ఆర్ చుట్టూ 160 కి.మీ., భువనగిరి, సంగారెడ్డి, షాద్‌నగర్, కడ్తాల్ వరకు విస్తరణ కోసం అప్పట్లో కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.
అత్యంత కీలకమైన మైండ్‌స్పేస్-శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రోకు టెండర్లు పూర్తిచేసి, కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన కూడా చేయించామని చెప్పారు. భూసేకరణ అవసరం లేకుండా, పిల్లర్లు లేకుండా భూమ్మీదనే నిర్మించేలా దీన్ని డిజైన్ చేశామని ఆయన తెలిపారు. ‘‘రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే తీసుకున్న మొదటి అనాలోచిత నిర్ణయం ఎయిర్‌పోర్ట్ మెట్రో రద్దు చేయడం. నా భూములు ఉన్నాయని, బీఆర్ఎస్ నేతలకు లబ్ధి చేకూరుతుందని పిచ్చి పిచ్చి ఆరోపణలతో ప్రాజెక్టును రద్దు చేసి ఎల్ అండ్ టీపై మొదటి దెబ్బ వేశారు.
అప్పటి నుంచే సీఎంకు, ఎల్ అండ్ టీకి మధ్య పంచాయితీ మొదలైంది. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వంపై ఒక్క రూపాయి భారం కూడా పడకుండా మా సొంత ఖర్చులతో రిపేర్ చేస్తామని ఎల్ అండ్ టీ ముందుకు వచ్చింది. కాళేశ్వరాన్ని 'కూలేశ్వరం' అని బద్నాం చేద్దామనుకున్న రేవంత్ రెడ్డి ప్రచారానికి ఇది గండికొట్టింది. తమ రాజకీయ లబ్ధికి ఎల్ అండ్ టీ సహకరించలేదనే కోపంతో ఆ సంస్థపై రేవంత్‌రెడ్డి పగబట్టారు” అని కేటీఆర్ ఆరోపణలు చేశారు.
నన్ను అరెస్ట్ చేస్తే చేసుకోండి
‘‘నన్ను అరెస్టు చేస్తారని కాంగ్రెస్ నేతలు కండ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నరు. నేను పదేండ్లు మంత్రిగా చేసిన. లై డిటెక్టర్ టెస్టుకు కూడా సిద్దమని చెప్పిన. అరెస్టు చేసుకుంటే చేసుకోమనండి” అని కేటీఆర్ అన్నారు. మరో కార్పొరేట్ సంస్థను ఎలా బ్లాక్ మెయిల్ చేస్తున్నారో నాలుగైదు రోజుల్లో ఆధారాలతో బయటపెడతానని ఆయన చెప్పారు.