ఫార్ములా-ఈ కేసు లొట్టపీసు కేసే : కేటీఆర్

ఫార్ములా-ఈ కేసు లొట్టపీసు కేసే : కేటీఆర్
  •      లేనికేసు ఉన్నట్టుగా మసిపూసి మారేడుకాయ చేస్తున్నరు: కేటీఆర్​
  •     లబ్ధిపొందారని చెబుతున్న కంపెనీ పేరు చార్జిషీట్​లో ఎందుకు చేర్చలేదు?
  •     ఫార్ములా ఈ కేసులో చార్జిషీటుపై మీడియాతో చిట్​చాట్

హైదరాబాద్, వెలుగు: ఫార్ములా ఈ కార్ రేస్ కేసు ముమ్మాటికీ లొట్టపీసు కేసేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. లేని కేసు ఉన్నట్టుగా మసిపూసి మారేడు కాయ చేస్తున్నారని విమర్శించారు. ఈ కేసులో కేటీఆర్​ను ఏ1గా పేర్కొంటూ ఏసీబీ దాఖలు చేసిన చార్జిషీటుపై మంగళవారం ఆయన బీఆర్ఎస్​ఎల్పీలో మీడియాతో చిట్ చాట్​చేశారు. 

ఆరు గ్యారంటీలపై ప్రైవేట్​ మెంబర్ బిల్లు పెట్టేందుకు అనుమతివ్వాలని స్పీకర్​ను కోరామని, దాని నుంచి దృష్టి మళ్లించేందుకే ప్రభుత్వం మళ్లీ దీనిని బయటకు తీసుకొచ్చిందని విమర్శించారు. ఈ కేసులో ఎవరికి లబ్ధి జరిగిందని ప్రభుత్వం చెబుతున్నదో.. ఆ కంపెనీ పేరును కనీసం చార్జిషీటులో చేర్చలేదన్నారు. 

డబ్బు బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్​ఫర్ అయినట్టు ఉందని, అలాంటప్పుడు ఆ డబ్బును ప్రభుత్వం ఎందుకు రికవరీ చేయడం లేదని ప్రశ్నించారు. ‘‘హైదరాబాద్ ఇమేజ్ పెంచటానికి ఫార్ములా ఈ రేస్​ చేపట్టాం. కానీ, ఈ ప్రభుత్వం రూ.200 కోట్లు పెట్టి మిస్​వరల్డ్ పోటీలు పెట్టి రాష్ట్రం, దేశపరువు పోయేలా చేసింది. మెస్సీతో ఫుట్​బాల్ ఆట పేరిట రూ.వంద కోట్లు ఖర్చు చేశారు. దీనిపై ఎలాంటి చార్జిషీట్ దాఖలు చేశారు? సీఎం రేవంత్ నుంచి రికవరీ చేస్తారా? అక్రమ కేసులపై మేం కోర్టును ఆశ్రయిస్తం. ఫార్ములా ఈ రేస్​లో క్విడ్​ ప్రోకో జరగలేదు’’ అని ఆయన పేర్కొన్నారు. 

మూసీపై చర్చ ప్రజల దగ్గర పెట్టాలె 

మూసీపై చర్చ పెద్ద పెద్ద కాంట్రాక్టర్ల వద్ద కాకుండా.. ప్రజల వద్ద పెట్టాలని కేటీఆర్ సవాల్​ చేశారు. టీడీఆర్​ అతిపెద్ద స్కామ్ అని, కృత్రిమ డిమాండ్ క్రియేట్ చేస్తున్నారని ఆరోపించారు. టీడీఆర్​లను రేవంత్ కుటుంబ సభ్యులు.. ఏటీఎంలా మార్చుకున్నారన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక దీనిపై విచారణ చేయిస్తామన్నారు. అసెంబ్లీ సీట్లు పెంచడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. దక్షిణాది రాష్ట్రల్లో సీట్లు తగ్గించే ప్రయత్నం చేయొద్దన్నారు. అసలు డీలిమిటేషన్ ఎప్పుడో జరగాల్సిందని, ఇప్పటికే ఆలస్యమైందని చెప్పారు. పార్లమెంట్​లో దక్షిణాదికి 24 శాతం ప్రాతినిధ్యం ఉందని, యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.  

గ్యాస్ ​బండను 10 కిలోలు చేస్తరు

దేశమంతటా ఎల్పీజీ డిస్ట్రిబ్యూటరీల దగ్గర ప్రజలు క్యూలు కట్టాల్సిన పరిస్థితి వచ్చిందని కేటీఆర్ అన్నారు. దేశంలో గ్యాస్ కొరత, రాష్ట్రంలో సమస్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గన్​పార్క్ వద్ద, అసెంబ్లీలో ఎమ్మెల్యేల ఎంట్రీ పాయింట్ వద్ద నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. గ్యాస్ కొరత లేదని కేంద్రం చెప్తుంటే.. కొరత ఉందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నదని అన్నారు. 

ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన తర్వాత మే 4 నుంచి సిలిండర్ సైజ్​ను తగ్గించేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. 14 కిలోల బండను 10 కిలోలకు తగ్గించబోతున్నదన్నారు. దివ్యాంగులు కూడా రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మంగళవారం అసెంబ్లీ బయట పలువురు దివ్యాంగులు కేటీఆర్​ను కలిశారు. ఎన్నికలప్పుడు కాంగ్రెస్​ దివ్యాంగులకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని డిమాండ్​ చేశారు.