ఉద్యమమిచ్చిన పదవిది..సినిమాల్లో నటించడానికి టైం లేదు: కేటీఆర్

ఉద్యమమిచ్చిన పదవిది..సినిమాల్లో నటించడానికి టైం లేదు: కేటీఆర్

‘సినిమాల్లో నటిస్తారా?’ అని అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ.. తనకు ఫుల్‌‌‌‌ టైం జాబ్‌‌‌‌ ఉందని, సినిమాల్లో నటించడానికి టైం లేదన్నారు. చేనేత వస్త్రాలకు తాను పెద్ద అభిమానినని తెలిపారు. కొత్త ఏడాదిలో మిడ్‌‌‌‌ మానేరు నుంచి కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోస్తామన్నారు. ఇరిగేషన్‌‌‌‌ ప్రాజెక్టులు కంప్లీట్‌‌‌‌ అవుతుండటంతో రానున్న రోజుల్లో ఆరోగ్యం, విద్య, మౌలిక వసతుల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇచ్చే చాన్స్‌‌‌‌ ఉంటుందని చెప్పారు. కొత్త మున్సిపల్‌‌‌‌ చట్టంతో ప్రజలకు చాలా ప్రయోజనాలుంటాయని వివరించారు. గ్రేటర్‌‌‌‌ వరంగల్‌‌‌‌ యాక్షన్‌‌‌‌ ప్లాన్‌‌‌‌ జనవరి మొదటి వారంలో ప్రారంభిస్తామని తెలిపారు.

ఓల్డ్‌‌‌‌ సిటీకి మెట్రో వస్తది

గ్రేటర్‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌లో రోడ్ల అభివృద్ధిని కొనసాగిస్తామని కేటీఆర్‌‌‌‌ చెప్పారు. ఇతర మహా నగరాలతో పోల్చితే హైదరాబాద్‌‌‌‌లోనే నీటి కొరత తక్కువన్నారు. గ్రేటర్‌‌‌‌ను టూరిస్ట్‌‌‌‌ డెస్టినేషన్‌‌‌‌గా మార్చేందుకు పర్యాటక ప్రాంతాల్లో శానిటేషన్‌‌‌‌ను ప్రైవేట్‌‌‌‌ సంస్థలకు అప్పగించామని చెప్పారు. చార్మినార్‌‌‌‌, గోల్కొండకు హెరిటేజ్‌‌‌‌ హోదా కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. అమెరికా, యూరప్‌‌‌‌ నుంచి మరిన్ని విమాన సర్వీసులు ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఎస్‌‌‌‌ఆర్‌‌‌‌డీపీకి నిధుల కొరత లేదని, గ్రేటర్‌‌‌‌లో 50 ఫుట్‌‌‌‌ ఓవర్‌‌‌‌ బ్రిడ్జిల నిర్మాణానికి ఇప్పటికే ఆమోదం తెలిపామన్నారు. ఓల్డ్‌‌‌‌ సిటీకి మెట్రో వస్తుందని.. కూకట్‌‌‌‌పల్లి, హైటెక్‌‌‌‌సిటీ, గచ్చిబౌలి ఏరియాలను లింక్‌‌‌‌ చేసే ప్రణాళిక సిద్ధమైందని తెలిపారు.

2020లో ఫార్మాసిటీ స్టార్టయితది

గ్రేటర్‌‌‌‌ సిటీ తూర్పు వైపున ఐటీ ఇండస్ట్రీ విస్తరించేలా చేస్తున్న ప్రయత్నాలకు మంచి స్పందన వస్తోందని మంత్రి చెప్పారు. గోపనపల్లిలో గేటెడ్‌‌‌‌ కమ్యూనిటీలు వస్తున్నాయని, వాటికి ఫైనాన్షియల్‌‌‌‌ డిస్ట్రిక్ట్‌‌‌‌ నుంచి కొత్త రోడ్డు వేయిస్తామని చెప్పారు. ఎల్బీ నగర్‌‌‌‌లో ఇప్పటికే ఓ ఫ్లై ఓవర్‌‌‌‌ పూర్తయ్యిందని, మరో మూడు సాగుతున్నాయని తెలిపారు. 111 జీవోలో మార్పులు అవసరమైతే ఉస్మాన్‌‌‌‌సాగర్‌‌‌‌, హిమాయత్‌‌‌‌సాగర్‌‌‌‌లపై ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అనంతగిరి, వికారాబాద్‌‌‌‌ అభివృద్ధి కోసం చాలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.
2020లో ఫార్మాసిటీ ప్రారంభమవుతుందన్నారు. సెకండ్‌‌‌‌ ఫేజ్‌‌‌‌ టీ-హబ్‌‌‌‌, టీ-వర్క్స్‌‌‌‌ జూలై తర్వాత పూర్తవుతాయని చెప్పారు. 4వ పారిశ్రామిక విప్లవం దిశగా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందన్నారు. ఎలాంటి చాలెంజ్‌‌‌‌నైనా ఎదుర్కోవడానికి యూత్‌‌‌‌ రెడీగా ఉందని చెప్పారు. యువతలో ఎంటర్‌‌‌‌ప్రెన్యూర్‌‌‌‌షిప్‌‌‌‌ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయన్నారు.

సీఏఏపై రాష్ట్ర కేబినెట్‌‌‌‌ నిర్ణయిస్తది

రాష్ట్రంలో సీఏఏ అమలుపై సీఎం కేసీఆర్‌‌‌‌ నేతృత్వంలోని కేబినెట్‌‌‌‌ నిర్ణయం తీసుకుంటుందని కేటీఆర్‌‌‌‌ చెప్పారు. ఈ చట్టాన్ని పార్లమెంటులో తాము వ్యతిరేకించామని, దీనిపై తమకు మద్దతుగా నిలుస్తున్న నెటిజన్లకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతమవడానికి ఈ చట్టాన్ని, హిందూ ముస్లిం కార్డును వాడుకుంటోందని ఆరోపించారు. ప్రజల మధ్య విభజన తెచ్చే ఏ ఎజెండానైనా ఎదుర్కోగల తెలివి రాష్ట్ర ప్రజలకు ఉందన్నారు. ఆర్థిక వృద్ధి తిరోగమనం, ఇతర అంశాలను పక్కదారి పట్టించేందుకే బీజేపీ ప్రయత్నాలు చేస్తోందన్నారు.