
- వ్యవసాయం, యూరియా సంక్షోభం వంటి అంశాలపైనా చర్చించాలి
- పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలిసి గన్‌పార్క్ వద్ద నిరసన
- యూరియా కొరత తీర్చాలంటూ వ్యవసాయ కమిషనర్‌కు వినతిపత్రం.. ధర్నా
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టుపై వేసింది జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కాదని, అది కాంగ్రెస్ వేసిన పీసీసీ కమిషన్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీలోనే కాకుండా ఎక్కడైనా తాము స్పష్టమైన సమాధానం చెప్పగలమన్నారు. శనివారం అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలిసి నివాళి అర్పించారు. యూరియా కొరతపై ఖాళీ యూరియా బస్తాలతో ధర్నాకు దిగారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా అసెంబ్లీకి వెళ్లారు.
ఈ సందర్భంగా గన్‌పార్క్ వద్ద కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో యూరియా సంక్షోభం, రైతుల కష్టాలపై చర్చ జరపకుండా, తమకు అనుకూలమైన ఒకటి రెండు అంశాలపైనే మాట్లాడి సభను ముగించడానికి సీఎం రేవంత్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రజల కష్టాలు, రైతుల సమస్యలపై చర్చించడానికి కనీసం 15 రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించినా చర్చలో పాల్గొనడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో ఏ ఒక్క రోజూ ఎరువుల కొరత కానీ, రైతులు లైన్లలో నిలబడాల్సిన దుస్థితిగానీ రాలేదని చెప్పారు. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులు లైన్లలో నిలబడాల్సిన దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందన్నారు.
వ్యవసాయ కమిషనర్‌కు వినతిపత్రం..
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బీఆర్ఎస్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సంతాప తీర్మానం అనంతరం.. కేటీఆర్, హరీశ్ రావుల నేతృత్వంలోని బీఆర్ఎస్ నేతలు వ్యవసాయ కమిషనర్ ఆఫీసుకు వెళ్లారు. వ్యవసాయ కమిషనర్‌కు యూరియా కొరతను తీర్చాలంటూ వినతి పత్రం ఇచ్చారు. తర్వాత కమిషనరేట్ ముందు పార్టీ నేతలు ధర్నాకు దిగారు.
ఆ నేతలను పోలీసులు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలోనే కేటీఆర్, హరీశ్ రావు తదితరులు సెక్రటేరియెట్ ముట్టడికి వెళ్లారు. ఉరుకులు పరుగులు తీశారు. అక్కడ భారీగా మోహరించిన పోలీసులు.. వారిని అడ్డుకోవడంతో గేటు ముందు బైఠాయించి నిరసన తెలిపారు. వారిని పోలీసులు అరెస్ట్ చేసి.. కాసేపటికి వదిలిపెట్టారు.