
హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబుపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుకు తామిచ్చే రిటర్న్ గిఫ్ట్ ఏంటో ఏప్రిల్ 11 తర్వాత తెలుస్తుందని కేటీఆర్ అన్నారు. ఫెడరల్ ఫ్రంట్ పై చంద్రబాబు చేస్తున్న విమర్శలు అర్థరహితమని అన్న కేటీఆర్.. జాతీయ పార్టీ పెడితే తప్పేముందని ప్రశ్నించారు. తమకు మహారాష్ట్ర ఎన్నికలపై ఎంత ఆసక్తి ఉంటుందో ఏపీలో ఎన్నికలపైనా అంతే ఆసక్తి ఉంటుందని.. అంతమాత్రాన తామేదో ఏపీలో జోక్యం చేసుకుంటున్నామని చంద్రబాబు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబును ఈ ఎన్నికల ద్వారా ఇంటికి పంపేందుకు అక్కడి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.
చంద్రబాబు పచ్చి అవకాశవాదిలా మాట్లాడుతున్నారని..అవకాశం వస్తే మళ్లీ మోదీ సర్కారులో చేరతారని కేటీఆర్ విమర్శించారు. తన దగ్గర పనిచేసిన కేసీఆర్ అంటూ చంద్రబాబు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఆయన అహంకారానికి నిదర్శనం అని అన్నారు. గతంలో చంద్రబాబు కాంగ్రెస్ క్యాబినెట్ లో మంత్రిగా పనిచేయలేదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ఇమేజ్ పాతాళంలో ఉందని కేటీఆర్ విమర్శించారు.