గ్రామాల్లో కాంగ్రెస్ కార్యకర్తల అరాచకం : కేటీఆర్

గ్రామాల్లో కాంగ్రెస్ కార్యకర్తల అరాచకం : కేటీఆర్
  • ఇందిరమ్మ ఇండ్లకు పైసలివ్వబోమని చెప్పడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలెవరు: కేటీఆర్​
  •     అర్హుల ఎంపిక అధికారం గ్రామసభ, సర్పంచ్​కే ఉంటుంది
  •     ఎవడైనా అడ్డుతగిలితే తాటతీసి లైన్​లో పెట్టాలని కార్యకర్తలకు పిలుపు

హైదరాబాద్/-పద్మారావునగర్, వెలుగు:  కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అధికారం తలకెక్కిందని, ప్రజాప్రతినిధులను చంపేస్తామంటూ బరితెగించి మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. మంగళవారం తెలంగాణభవన్​లో ఖానాపూర్, షాద్​నగర్ నియోజకవర్గాల్లో కొత్తగా ఎన్నికైన బీఆర్ఎస్ మద్దతుదారులైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను సన్మానించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారని, ఒక ఎమ్మెల్యే అయితే ‘నన్ను ఓడించి చంపేస్తే.. నేను మిమ్మల్ని గెలిచి చంపేస్తా’ అని బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేల మాటలతో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా గ్రామాల్లో అరాచకాలు చేస్తున్నారన్నారు. 

సర్పంచులు ఎవరూ ఇలాంటి బెదిరింపులకు లొంగవద్దని సూచించారు. ‘‘ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వకపోవడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరు? అవి మీ అబ్బ సొత్తు కాదు. రేవంత్ రెడ్డి ఏమైనా తన భూములు అమ్మి నిధులిస్తున్నారా? ప్రజల పైసలతో కడుతున్న ఇండ్లకు అర్హులను ఎంపిక చేసే పూర్తి అధికారం గ్రామ సభలకు, సర్పంచులకే ఉంటుంది. ఎవడైనా అడ్డుతగిలితే తాట తీసి లైన్ లో పెట్టండి’’ అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

పోలీసులు పనిచేయకపోతే..మేం తిరగబడాల్సి వస్తది

బీఆర్ఎస్ నాయకులపై దాడులు పెరిగాయని, పోలీసులు సరిగ్గా పనిచేయకపోతే తాము తిరగబడాల్సి వస్తుందని కేటీఆర్ హెచ్చరించారు. నిందితులపై చర్యలు తీసుకోకపోతే, పోలీసుల డ్యూటీ మేం చేయాల్సి వస్తుందన్నారు. దీంతో రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. 

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమార్ పేట ఘటనలో గాయపడిన సర్పంచ్ అభ్యర్థి కుటుంబసభ్యులను మంగళవారం ఆయన సికింద్రాబాద్​యశోద హాస్పిటల్లో  పరామర్శించారు. వైద్య ఖర్చులను బీఆర్ఎస్ పార్టీనే భరిస్తుందని, అండగా ఉంటామని హామీ ఇచ్చారు. 

సోమార్​పేట ఘటనపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమార్‌‌‌‌పేట్ ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​లో పిటిషన్ దాఖలైంది. ఈ నెల 15న ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్ కురుమ పాపయ్య సోదరుడు చిరంజీవి.. సర్పంచ్​గా పోటీ చేసి ఓడిపోయిన రాజు ఇంటి వద్ద ట్రాక్టర్​తో హింసకు పాల్పడ్డాడు. దీనిపై ఆదే గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త డాక్టర్ పైడి ఎల్లారెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్​కు కూడా ఫిర్యాదు చేశారు.