- రైతులకు ఇచ్చిన హామీలు సర్కార్ నెరవేర్చలేదు: కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యవసాయ రంగంలో దుర్భర పరిస్థితులు ఏర్పడ్డాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్అన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శించారు. రుణమాఫీ అరకొరగా చేశారని, రైతు భరోసాకు దిక్కులేదని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆదివారం ఎర్రవల్లిలోని ఫాం హౌస్‌లో పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం చేసిన తర్వాత మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. ప్రభుత్వ వైఫల్యాలపై సమావేశంలో కేసీఆర్ చర్చించారని చెప్పారు. రైతుల గొంతుకగా మండలి, అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు.
రాష్ట్రంలో దౌర్జన్యకాండ..
రాష్ట్రంలో దౌర్జన్యకాండ జరుగుతున్నదని కేటీఆర్ విమర్శించారు. కొడంగల్, సంగారెడ్డి లాంటి ప్రాంతాల్లో దళిత, గిరిజన రైతులపై ప్రభుత్వం దాడులు చేస్తున్నదని ఆరోపించారు. అక్రమ కేసులు పెట్టి భూములను లాక్కుంటున్నదన్నారు. ఫార్మా సిటీ కోసం ఇప్పటికే 14 వేల ఎకరాలను సేకరించామని, ఫార్మా సిటీని కొనసాగిస్తామంటూ హైకోర్టుకు ప్రభుత్వం చెప్పిందని తెలిపారు. అలాంటప్పుడు 20 ఫార్మా విలేజ్‌లు ఎందుకని ఆయన ప్రశ్నించారు.