- మాకు అంబేద్కర్, గాంధీ, జయశంకర్ ఆదర్శం
- రేవంత్ రెడ్డి నిరంకుశ, ఫాసిస్ట్ మనస్తత్వం ఇప్పుడు దేశం మొత్తానికి తెలిసిందని కామెంట్
హైదరాబాద్, వెలుగు: ప్రపంచంలోనే అత్యంత క్రూరుడైన నియంత హిట్లర్ ఆదర్శం కనుకే రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఎన్నో అరాచకాలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. బెంగళూరు వేదికగా జరిగిన ‘ది హిందూ హడిల్’ సదస్సులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతల కోసం ఏర్పాటు చేసిన ‘హైడ్రా’ సంస్థకు, దాని పనితీరుకు జర్మనీ నియంత ఆడాల్ఫ్ హిట్లర్ చర్యలే స్ఫూర్తి అని సీఎం బహిరంగంగా ఒప్పుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం వ్యాఖ్యలపై ఆదివారం ‘ఎక్స్’ వేదికగా స్పందించిన కేటీఆర్, రేవంత్ రెడ్డి నిరంకుశ, ఫాసిస్ట్ మనస్తత్వం ఇప్పుడు దేశం మొత్తానికి అర్థమైందని అన్నారు.
పేదల ఇండ్లు కూల్చి గొప్పగా చెప్పుకుంటున్నరు
‘‘రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన ‘హైడ్రా’ ఒక హంతక ముఠా లాంటిది. పేదల ఇండ్ల కూల్చివేతలను గొప్పగా చెప్పుకుంటూ మురిసిపోతున్నారు. మీ ఫాసిస్ట్ ఆలోచనలను మీ నోటితోనే దేశం మొత్తానికి స్పష్టం చేసినందుకు ధన్యవాదాలు” అని కేటీఆర్ విమర్శించారు. బీఆర్‌ఎస్ పార్టీ ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉందని కేటీఆర్ తెలిపారు.
రేవంత్ రెడ్డిలా హిట్లర్ తరహా తెలివితేటలు తమకు లేవని అన్నారు. మా పదేండ్ల పరిపాలనను అంబేద్కర్ అందించిన రాజ్యాంగ స్ఫూర్తితో, మహాత్మా గాంధీ చూపిన అహింసా మార్గంలో, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ కన్న కలల ఆశయాల ప్రాతిపదికన నడిపించామని పేర్కొన్నారు. అత్యంత క్రూరుడైన నియంత హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకుంటున్నానని రేవంత్‌రెడ్డి ప్రకటించడాన్ని కాంగ్రెస్ హైకమాండ్ సమర్థిస్తుందా? అని కేటీఆర్ ప్రశ్నించారు.
ధర్మేంద్ర ప్రధాన్‌ను మంత్రి పదవి నుంచి తప్పించాలి
నీట్ స్కామ్, పేపర్ లీకేజ్‌కు కేంద్రమే పూర్తి బాధ్యత వహించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. వెంటనే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను మంత్రి పదవి నుంచి తప్పించాలని ప్రధాని మోదీని కోరారు. విద్యార్థుల కోపంలో వంద శాతం న్యాయముందని అన్నారు. పరీక్ష నిర్వహణలో ఎన్టీఏ ఘోరంగా విఫలమైందని, మళ్లీ రీఎగ్జామ్ పెట్టడం అన్యాయమేనని అన్నారు. ఇది తాత్కాలిక స్పీడ్ బ్రేకర్ లాంటిదని విద్యార్థులకు సూచించారు.
2024లో గ్రేస్ మార్కుల పేరిట అవకతవకలు జరిగాయని, అసలు గ్రేస్ మార్కులు ఎందుకు కలిపారో ఎన్టీఏ వద్ద ఇప్పటికీ సమాధానం లేదన్నారు. బాధ్యతారహితంగా వ్యవహరించి లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారని మండిపడ్డారు. కొంతమందికి అడ్డదారిలో మార్కులు కలిపి, కష్టపడ్డ విద్యార్థులకు అన్యాయం చేయడం ఘోరమైన నేరమన్నారు. పేపర్లు లీక్ కాకుండా ఉండేందుకు ఏఐని వాడుకుని ‘ఫూల్ ప్రూఫ్’ సిస్టమ్స్ తేవడంపై కేంద్రం దృష్టి పెట్టాలన్నారు.
