
‘జీఎస్‌డీపీలో 0.5 శాతం మేర రుణాలు తీసుకోవచ్చన్న కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. క్యాపిటల్ ప్రాజెక్టులపై ఖర్చు చేయడానికే రుణం తీసుకోవాలన్న నిబంధనను పాటిస్తాం. ఇందుకు అనుగుణంగా ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితిని 2 శాతానికి పెంచాలి’ అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను మంత్రి కేటీఆర్కోరారు. సోమవారం కేంద్ర ఆర్థిక శాఖ నిర్వహించిన రాష్ట్రాల సీఎంలు, ఆర్థిక మంత్రుల వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రగతి భవన్ నుంచి మంత్రి హరీశ్‌రావుతో కలిసి కేటీఆర్ పాల్గొన్నారు. అభివృద్ధిలో ముందంజలో ఉన్న రాష్ట్రాలకు ఆర్థిక శాఖ నిబంధనలను సరళీకరిస్తే ఇంకా సమర్థంగా పనిచేయడానికి అవకాశం ఉంటుందన్నారు.
జీడీపీలో పెట్టుబడి శాతం తగ్గడం వల్ల, దేశ ఆర్థిక పరిస్థితి దెబ్బతింటోందని, పెట్టుబడులను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రానికి సముద్ర తీరం లేనందున డ్రైపోర్టులు ఏర్పాటు చేయాలని కేటీఆర్ కోరారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ ఇంతవరకూ మంజూరు చేయలేదన్నారు. డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్స్, ఫార్మా పరిశ్రమల్లో తెలంగాణకు అవసరమైన ఎకో సిస్టమ్ ఉన్నందున తమ విన్నపాన్ని పరిగణించాలన్నారు.