కేసీఆర్ లేకపోతే టీపీసీసీ, టీబీజేపీ ఎక్కడివి? 

కేసీఆర్ లేకపోతే టీపీసీసీ, టీబీజేపీ ఎక్కడివి? 

హనుమకొండ: మనీ పవర్.. మజిల్ పవర్ లేకున్నా.. గుండె బలంతో ఉద్యమాన్ని నడిపించి రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి కేసీఆర్ అని మంత్రి కేటీఆర్ అన్నారు. హనుమకొండలో టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన.. ఎన్టీఆర్ లాగా కేసీఆర్ సినిమా స్టార్ కాదని నిఖార్సైన ఉద్యమ నాయకుడని చెప్పారు. కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు చాలు జీవితాంతం టీఆర్ఎస్కు ఓటేయడానికి అని అన్నారు.

రాష్ట్రం విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై కేటీఆర్ మండిపడ్డారు. ప్రధాని మోడీ కేవలం గుజరాత్ కే పీఎంలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దేశవ్యాప్తంగా 157 కొత్త మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే అందులో ఒక్కటి కూడా తెలంగాణకు ఇవ్వలేదని అన్నారు. ఏడేళ్లలో తెలంగాణ నుంచి కేంద్రానికి రూ.3,65,797 కోట్లు ట్యాక్సుల రూపంలో వెళ్తే రాష్ట్రానికి ఇచ్చింది మాత్రం రూ.1,68,647 కోట్లు మాత్రమేనని కేటీఆర్ అన్నారు. తన లెక్క తప్పని రుజువు చేస్తే మంత్రి పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా కొనసాగుతానని చెప్పారు. 

తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ నాయకులపై కేటీఆర్ ఘాటు విమర్శలు చేశారు. బండి సంజయ్, రేవంత్ రెడ్డి ఉద్యమ సమయంలో ఎక్కడున్నరని.. కేసీఆర్ లేకపోతే వారికి ఇప్పుడున్న పదవులు ఎక్కడివని ప్రశ్నించారు. బీజేపీ నాయకులను బఫూన్లతో పోల్చిన కేటీఆర్.. బండి సంజయ్ కరీంనగర్ వదిలి పాలమూరులో ప్రజా సంగ్రామ యాత్ర చేయడాన్ని తప్పుబట్టారు. తంబాకు బుక్కుతూ చిల్లర రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెన్నెముక లేని నాయకుడని అసలు మోడీ ఏ రోజైనా ఈ బఫూన్ గాళ్లను చూసిండా అని అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కనీసం ఒక్క ఎమ్మెల్యేను గెలిపించే సత్తా లేదన్న కేటీఆర్.. చిల్లర మాటలు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.