నమో అంటే.. నమ్మించి మోసం చేసుడే : బీజేపీ నేతలపై కేటీఆర్ ఫైర్

నమో అంటే.. నమ్మించి మోసం చేసుడే : బీజేపీ నేతలపై కేటీఆర్ ఫైర్
  •     దేవుడి పేరు చెప్పి ఓట్లడుగుతున్నరు
  •     మోదీ అదానీ సేవలో మునిగిపోయారు
  •     భైంసా రోడ్ షోలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
  •     కేటీఆర్​పై టమాటలు విసిరిన హనుమాన్ స్వాములు
  •     పోలీసుల లాఠీచార్జ్

భైంసా/నిర్మల్/అల్వాల్/కంటోన్మెంట్, వెలుగు: నమో అంటే.. నమ్మించి మోసం చేయడం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. దేశాన్ని ముంచినవాళ్లు దేవుడి పేరు చెప్పుకుని ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. బీజేపీ లీడర్లంతా అదానీ సేవలో మునిగిపోయారని ఎద్దేవా చేశారు. ఆదిలాబాద్​లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య యుద్ధం నడుస్తున్నదన్నారు. ఏ పార్టీతో జీవితాలు బాగు పడ్డాయో ప్రజలు ఆలోచించాలని కోరారు. గురువారం సాయంత్రం నిర్మల్ జిల్లా భైంసాలోని మున్సిపల్ ఆఫీస్ సమీపంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. ‘‘నమ్మించి మోసం చేసేటోళ్లను నమో అంటారు. బీజేపీ మత రాజకీయాలు చేస్తున్నది. పదేండ్లు అధికారంలో ఉన్నది. 

ఏం అభివృద్ధి చేశారో చెప్పుకునే పరిస్థితి లేదు. గతంలో ఆదిలాబాద్​కు వచ్చిన అమిత్ షా.. సీసీఐ తెరిపిస్తానని హామీ ఇచ్చిండు. ఇంత వరకు తెరిపించలేదు. ఆర్మూర్– ఆదిలాబాద్ రైల్వే లైన్ ఏమైంది? ఇప్పుడున్న బీజేపీ ఎంపీ ముధోల్ నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. విదేశాల్లో ఉన్న నల్లధనం తీసుకొచ్చి ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 లక్షల చొప్పున వేస్తానని 2014 ఎన్నికల్లో మోదీ హామీ ఇచ్చారు. ఇప్పటి దాకా ఒక్క రూపాయి వేయలేదు’’అని అన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న మోదీ హామీ ఏమైందని ప్రశ్నించారు. బీజేపీ వాళ్లు మాట్లాడితే మతం అంటారని, హిందూ, ముస్లిం తప్ప ఇంకోటి ఏదీ ఉండదన్నారు. 

బీజేపీకి ఓటేస్తే హైదరాబాద్​ను యూటీ చేస్తరు

బీజేపీకి ఓటేసి గెలిపిస్తే హైదరాబాద్​ను కేంద్ర పాలిత ప్రాంతంగా మారుస్తారని కేటీఆర్ అన్నారు. మన జుట్టు తీసుకుపోయి.. ఢిల్లీ వాడి చేతిలో పెట్టినట్లు అవుతుందని తెలిపారు. ఈ కుట్రను అడ్డుకోవాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి పార్లమెంట్​కు పంపించాలన్నారు. నిర్మల్, అల్వాల్, కంటోన్మెంట్ ఏరియాల్లో నిర్వహించిన ప్రచార కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పదేండ్లు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నామన్నారు. కేసీఆర్ ఉన్నంత కాలం రాష్ట్రంలో మోదీ ఆటలు సాగవని చెప్పారు. ఐదు నెలల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అతలాకుతలమైందన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కరెంట్ కోతల్లేవన్నారు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ కట్ చేస్తున్నారని విమర్శించారు. 24 గంటలు కరెంట్ ఇచ్చే బీఆర్ఎస్ కావాలా.. పవర్ కట్ చేసే కాంగ్రెస్ కావాలా తేల్చుకోవాలన్నారు.