కేటీఆర్ ​గ్రాఫ్​ పడిపోయిందా..?

కేటీఆర్ ​గ్రాఫ్​ పడిపోయిందా..?

సీఎం కుమారుడు… టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్​కేటీఆర్​కు సొంత నియోజకవర్గంలో ఓట్ల గ్రాఫ్​ పడిపోయింది. ఫలితంగా కరీంనగర్ సిట్టింగ్​సీటును టీఆర్​ఎస్ గెలుచుకోలేక పోయింది. అక్కడ పోటీలో ఉన్న సిట్టింగ్​ఎంపీ, సీఎం సమీప బంధువైన వినోద్​కుమార్ ఘోర పరాజయానికి దారి తీసింది. తెలంగాణ ఉద్యమం నుంచి పార్టీకి​ కంచుకోటగా పేరున్న కరీంనగర్​లోక్​సభ నియోజకవర్గంలో టీఆర్​ఎస్ మరోసారి​ చేదు ఫలితాన్ని చవి చూసింది. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్​ 89508 ఓట్ల మెజారిటీతో వినోద్​కుమార్​పై విజయం సాధించారు. కేటీఆర్​ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల అసెంబ్లీ సెగ్మెంట్​కరీంనగర్​నియోజకవర్గ పరిధిలోనే ఉంది. డిసెంబర్​లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేటీఆర్​తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థిపై 89009 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. నాలుగు నెలల్లోనే జరిగిన లోక్​సభ ఎన్నికలకల్లా సీన్ మారిపోయింది. కేటీఆర్​ సొంత సెగ్మెంట్​లో టీఆర్​ఎస్​ ఓట్లకు భారీగా గండి పడింది. సిరిసిల్ల​లో నాలుగు నెలల కిందట కేటీఆర్​కు 1,25,213 ఓట్లు వస్తే ఇప్పుడు వినోద్​కుమార్​కు 70482 ఓట్లే పడ్డాయి. అంటే అర లక్షకు పైగా గండి. ఇది గులాబీ  శ్రేణులను ఆందోళనకు గురి చేసింది.

అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్లలో కేవలం మూడు వేల ఓట్లు సాధించి నాలుగో స్థానానికి పరిమితమైన బీజేపీ ఈసారి అనూహ్యంగా పుంజుకుంది. ఇక్కడి ఓటర్లు బీజేపీకి 64769 ఓట్లను కట్టబెట్టి ఆ పార్టీ అభ్యర్థి విజయంలో కీలక పాత్ర పోషించారు. సిరిసిల్లలో కేవలం ​5713 ఓట్ల ఆధిక్యంతో టీఆర్​ఎస్​ పరువు నిలబెట్టుకున్నప్పటికీ.. ఇదే జిల్లాలోని వేములవాడ సెగ్మెంట్​లో అట్టర్​ ప్లాఫ్​ అయింది. అక్కడ టీఆర్​ఎస్​పై బీజేపీ అన్ని మండలాల్లోనూ పై చేయి సాధించింది.  ఏకంగా 25891 ఓట్ల మెజారిటీతో అందనంత ముందుకు దూసుకెళ్లింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్​గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కేటీఆర్ సొంత ఇలాఖాలో ఇంత దారుణంగా ఫలితాలు రావటం గులాబీ శ్రేణులను నిరుత్సాహానికి గురి చేశాయి. స్వయంగా కేటీఆరే ఇక్కడ ఎంపీ ఎన్నికల ప్రచార బాధ్యతలను సైతం  స్వీకరించారు. నియోజకవర్గంలో ప్రతి మండలానికో… భారీ బహిరంగ సభ పెట్టి  జనాన్ని సమీకరించారు. అంత జేసినా ఫలితాలు ఆశించినట్లుగా రాకపోవటం చర్చనీయాంశంగా మారింది. క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ నాయకత్వం పట్టించుకోకపోవటంతోనే ఈ పరిస్థితి తలెత్తిందనే అభిప్రాయాలున్నాయి. కేసీఆర్​, కేటీఆర్ ఇమేజీ గెలిపిస్తుందని, సారు..కారు..పదహరు అనే నినాధంతో ఓట్లు రాలుతాయని, సంక్షేమ పథకాల లబ్ధిదారులే తమకు ఓట్లు వేస్తారని ఇక్కడి జిల్లా, మండల స్థాయి నాయకులు గట్టిగా నమ్మారు.

అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీ వచ్చిందని ఎంపీ ఎన్నికలను తేలిగ్గా తీసుకొని పల్లెల్లో ప్రచారానికి దూరంగా ఉన్నారు. అదే సమయంలో బీజేపీ పుంజుకోవటంతో ఎంపీ సీటును కైవసం చేసుకొనే అవకాశాలన్నీ మిస్సయ్యాయి.  ప్రధానంగా జిల్లాలోని టీఆర్​ఎస్​ నేతల అతినమ్మకమే కొంప ముంచిందని చర్చ జరుగుతోంది. మరోవైపు నియోజకవర్గంలో టీఆర్ఎస్ గ్రూపు రాజకీయాలు సైతం పార్టీని వెంటాడుతున్నాయి.  పలు మండలాల్లో మండల నాయకుల పనితీరు.. వారిపై వస్తున్న విమర్శలపై అప్రమత్తమైన కేటీఆర్​ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కొందరిని  పక్కనపెట్టారు. అప్పటికే జరిగిన ఎంపీ ఎన్నికల్లో.. జరగాల్సిన నష్టం జరిగిపోయిందని పార్టీ నేతల్లో చర్చ మొదలైంది. మరోవైపు టీఆర్ఎస్ లోని ఒక వర్గం లోపాయకారీగా బీజేపీకి సపోర్ట్ చేసిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. కేటీఆర్ ఇలాకాలో క్యాడర్ లేని బీజేపికి కారు గుర్తుతో పోటాపోటీగా ఓట్లు పడటం చర్చనీయాంశమైంది