నువ్వు కాదు.. మీ నాన్నతో  రాజీనామా చేయించు

నువ్వు కాదు.. మీ నాన్నతో  రాజీనామా చేయించు

కేంద్రం తక్కువిస్తే ఢిల్లీల ఎందుకు అడగలే?
రాజ్యాంగం తెలియని అజ్ఞాని కేటీఆర్.. పట్టించుకోమని కామెంట్​


మెదక్, వెలుగు:‘‘ఇచ్చిన హామీలు నెరవేర్చనందుకు.. డబుల్ బెడ్ రూమ్‌‌‌‌ ఇళ్లు ఇవ్వనందుకు.. రుణమాఫీ చేయనందుకు.. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసినందుకు.. రైతులు, ఇంటర్ స్టూడెంట్లు ఆత్మహత్యలు చేసుకున్నందుకు.. సకల జనులను వంచించినందుకు.. మీ నాన్న (ముఖ్యమంత్రి కేసీఆర్​) రాజీనామా చేయాలి కేటీఆర్’’ అని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఫైర్ అయ్యారు. కేటీఆర్ ఓ అజ్ఞాని అని, ఆయన మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. మంగళవారం మెదక్ లో మీడియాతో సంజయ్ మాట్లాడారు. తెలంగాణ ఐదేళ్లలో 2.72 లక్షల కోట్లు పన్నుల రూపంలో చెల్లిస్తే.. కేంద్రం రాష్ట్రానికి 1.42 లక్షల కోట్లు మాత్రమే ఇచ్చిందని, ఇది నిజం కాదని నిరూపిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి కేటీఆర్ సవాల్ చేయడాన్ని పట్టించుకోబోమన్నారు. ‘‘మీ అయ్య మొన్న ఢిల్లీకి పోయి ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులను కలిసిండు కదా. అప్పుడు అక్కడ ఈ విషయం ఎందుకు అడగలేదు. మీ అయ్య వస్తే.. ఇద్దరం వెళ్లి మోడీ వద్దకు వెళ్లి రాజీనామా చేస్తం. రమ్మనమను” అని సవాల్ విసిరారు. కేటీఆర్ రాజ్యాంగం తెలియని అజ్ఞాని అని, అవగాహన లేకుండా ఏదేదో మాట్లాడతాడని, అవి పట్టించుకోబోమని అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాలకు 32 శాతం వాటా నిధులిస్తే.. నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చాక 41 శాతానికి పెంచిందన్నారు.
గుప్త నిధి కోసమేనా?
‘‘ఉన్న సచివాలయాన్ని కూల్చేసి కొత్తది కడతనని ముఖ్యమంత్రి చెప్పిండు. అందులో ఏదో మతలబు ఉంది. గుప్త నిధి ఉందని ప్రచారం జరుగుతోంది” అని బండి సంజయ్ అన్నారు. ‘‘పీఆర్సీ గురించి ప్రకటన చేసినా గతేడాది బకాయిలు ఇవ్వడం లేదు. రిటైర్ అయ్యాక లేదా ఉద్యోగి చనిపోతే బకాయిలు ఇస్తామని కేసీఆర్ చెబుతుండు. ఇంతకంటే మూర్ఖుడు ఇంకొకరు ఉంటారా? ఏం బిచ్చమేస్తున్నవా ఉద్యోగులకు?’’ అని నిలదీశారు. ఆర్టీసీలో దాదాపు వెయ్యి బస్సులను తీసేసిన్రని, రూ.1,300 కోట్ల ఆర్టీసీ నిధిని ప్రభుత్వం వాడుకుందని.. ఇప్పుడు ఆర్టీసీ ఆస్తులను అమ్ముకోవాలని ప్లాన్ చేస్తోందని సంజయ్ ఫైర్ అయ్యారు. ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, పాదయాత్ర ప్రముఖ్ మనోహర్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి, సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాశ్ పాల్గొన్నారు.

కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తుండు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని రాష్ట్రంలో ఎందుకు అమలు చేయడం లేదో సీఎం సమాధానం చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ‘‘రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తామని మోడీ చెప్తే.. ఆనాడు ప్రధానికి రుణపడి ఉంటామని కేసీఆర్ చెప్పిండు. ఇప్పుడేమో రాష్ట్రానికి కేంద్రం ఏం చేస్తలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నడు. ఏమీ చేయకపోతే కేంద్రానికి లేఖ రాసే దమ్ముందా? అని కేసీఆర్ ను అడిగితే సమాధానం కూడా చెప్పలేదు” అని మండిపడ్డారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా మంగళవారం మెదక్‌‌‌‌లోని రాందాస్ చౌరస్తాలో జరిగిన బహిరంగ సభలో సంజయ్ మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలకు పూర్తి బాధ్యత సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌దేనని అన్నారు. వరి వేస్తే ఉరేనని సీఎం చేసిన వ్యాఖ్యలతో ఐదుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, అవి ముఖ్యమంత్రి చేసిన హత్యలని ఘాటుగా విమర్శించారు. వెంటనే రైతులకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు. మాజీ మంత్రి బాబుమోహన్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​రావు, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు భాష, మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతామూర్తి పాల్గొన్నారు.