- ఆయన పిలుపు ఇస్తే స్పందిస్తున్నరు
- కరోనా క్రైసిస్ నిరూపించింది ఇదే
- దేశ రాజకీయాలపైనా టీఆర్ఎస్ ముద్ర
- మా స్కీమ్‌లనే మిగతవాళ్లు కాపీ కొడుతున్నరు
- ఉద్యమకారుడిగా, పాలన దక్షుడిగా కేసీఆర్ సక్సెస్
- కరోనా టెస్టులు ఎక్కువ చేస్తే ప్రైజులిస్తరా?
- టీఆర్ఎస్ 20 ఏండ్ల జర్నీపై మీడియాతో చిట్ చాట్
హైదరాబాద్, వెలుగు: ‘‘అంతా కేసీఆర్ ఏం చెప్పినా చేస్తున్నరు. ఈ క్రైసిస్‌లో ఆయన ఇచ్చిన పిలుపును పాటిస్తున్నరు. చికెన్ తినుమంటే తింటున్నరు. బత్తాయిలు కొనుమంటే కొంటున్నరు. ఆయనపై విశ్వాసం ఉన్నందునే జనం అంతగా నమ్ముతున్నరు. కేసీఆర్ తీరును చూసి ఎందరో మెచ్చుకుంటున్నరు. ఆయన ఇమేజ్ పెరిగింది..” అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. కేసీఆర్ మీడియా సమావేశం ఉందంటే చాలు లక్షలాది మంది టీవీల ముందు ఎదురుచూస్తున్నారని చెప్పారు. ఉద్యమ నాయకుడి నుంచి సీఎంగా కేసీఆర్ సక్సెస్ చూసి.. భవిష్యత్ లో స్టడీస్, థీసీస్ జరిగి డాక్టరేట్లు వస్తాయన్నారు. దేశ రాజకీయాలను శాసించే స్థాయిలో లేకున్నా చాలా అంశాలపై తమ ముద్ర ఉందన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి సోమవారంతో 20 ఏండ్లు అవుతున్న సందర్భంగా ఆదివారం కేటీఆర్ ప్రగతిభవన్‌లో మీడియాతో మాట్లాడారు.
టీఆర్ఎస్ 20 ఏండ్ల ప్రస్థానాన్ని ‘జల దృశ్యం నుంచి సుజల దృశ్యం వరకు’ అని కేటీఆర్ చెప్పారు. ప్రజల ఆకాంక్షల మేరకు సాగునీటి పథకాలను అమలు చేస్తున్నామని, కోటి ఎకరాలకు నీళ్లిచ్చేలా ఇరిగేషన్ పథకాలను చేపట్టామని తెలిపారు. ‘‘దేశంలో ఏ పార్టీకి లేని చరిత్ర టీఆర్ఎస్ కు దక్కింది. 20 ఏండ్లుగా ప్రజలు టీఆర్ఎస్ ను ఆదరిస్తున్నారు. ఇలాంటిది బహుశా ఏ రాజకీయ పార్టీకి కూడా దక్కలేదు. జనం మాకు అన్నిరకాలుగా సపోర్టు ఇస్తున్నందునే సక్సెస్ ఫుల్‌గా ముందుకు వెళ్తున్నం..” అని పేర్కొన్నారు.
దేశ రాజకీయాలను శాసించలేకున్నా..
దేశ రాజకీయాలపై టీఆర్ఎస్ ముద్ర ఉందని కేటీఆర్ అన్నారు. తాము దేశ రాజకీయాలను శాసించే స్థాయిలో లేకున్నా, తమ పథకాలను కేంద్రం, పలు రాష్ట్రాలు ప్రేరణగా తీసుకుంటున్నాయని చెప్పారు. గతంలో బెంగాల్, గుజరాత్ మోడల్ అని చెప్పుకునే వారని, ఇప్పుడు తెలంగాణ మోడల్ అంటున్నారన్నారు. ‘‘కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రావాలని కోరుకున్నం. కానీ రాలేదు. దేశ రాజకీయాల్లో ప్రత్యక్షంగా ముద్ర వేయలేకపోయినా.. పరోక్షంగా వేస్తున్నం. రైతు బంధును చూసే పీఎం కిసాన్ స్కీమ్ తెచ్చారు. మిషన్ భగీరథ పథకాన్ని పదకొండు రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. ఇలా ఎన్నో అంశాల్లో దేశంపై టీఆర్ఎస్ ముద్ర ఉంది” అని పేర్కొన్నారు.
ఐదు విప్లవాలకు నాంది
అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిర్మించిన ఘనత టీఆర్ఎస్ కు దక్కుతోందని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడంతో జల విప్లవం వచ్చిందని.. దానితో మరో నాలుగు విప్లవాలు వచ్చాయని చెప్పారు. ‘‘కోటి ఎకరాలకు నీళ్లివ్వడంతో హరిత విప్లవం, ఇరిగేషన్ ప్రాజెక్టుల నీళ్లతో చెరువులు నింపడంతో చేపల పెంపకం జోరుగా జరిగి నీలి విప్లవం. గొర్రెల పెంపకంతో పింక్ రివల్యూషన్ వచ్చింది. బర్రెల పంపకం వల్ల క్షీర విప్లవం వచ్చింది’’ అని పేర్కొన్నారు.
కేసీఆర్ పై పరిశోధనలు జరుగుతయ్
ఉద్యమ నాయకుడి నుంచి సీఎంగా కేసీఆర్ సక్సెస్ చూసి.. భవిష్యత్‌లో అధ్యయనాలు, థీసీస్ జరిగి డాక్టరేట్లు వస్తాయని కేటీఆర్ పేర్కొన్నారు. ‘‘కేసీఆర్ ఉద్యమం నడిపిన తీరు, రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిపాలిస్తున్న శైలిపై భవిష్యత్తులో అధ్యయనాలు జరుగుతాయనడంలో అతిశయోక్తి లేదు. జనం ప్రతిపక్షాలను వద్దనుకుంటున్నారు. అందుకే ప్రతి ఎన్నికల్లో వంద శాతం విజయాలు టీఆర్ఎస్ కు కట్టబెడ్తున్నరు. ఈ విషయంపై విపక్షాలు ఆత్మ విమర్శ చేసుకోవాలి’’ అని చెప్పారు. రాష్ట్ర విభజన సందర్భంగా చాలా మంది కేసీఆర్ ను ద్వేషించారని, ఇప్పుడు వాళ్లే కీర్తిస్తున్నారని పేర్కొన్నారు. 2009 ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు టీఆర్ఎస్ పనైపోయిందని ప్రచారం చేశారని, కానీ తాము ఫీనిక్స్ పక్షిలా ఎగిరి, సత్తా చూపించామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో చేదు అనుభవాలు చవిచూశామన్నారు. ‘‘అప్పట్లో సీఎం కిరణ్ ను కలిసేందుకు నేను, శ్రీధర్ బాబు వెళ్లాం. ఏం తీసుకుంటావని కిరణ్ అడిగారు. కాఫీ తాగుతవా, చాయ్ తాగుతవా అన్నారు. నేను కాఫీ తాగుతా అన్నాను. తెలంగాణోళ్లకు చాయ్ తాగుడు అలవాటు కదా.. అని వెటకారంగా అన్నాడు’’ అని కేటీఆర్ చెప్పారు.
మోడీకి మద్దతు పలికినం
బీజేపీతో సైద్ధాంతిక విభేదాలు ఉన్నా కరోనా వంటి క్లిష్ట సమయంలో మద్దతు పలికామని కేటీఆర్ చెప్పారు. లాక్ డౌన్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక సాయం కావాలని అడిగామని, ఇంకా స్పందన రాలేదని పేర్కొన్నారు. కేంద్రంలో అనేక అంశాలు పెండింగ్ లో ఉన్నాయని.. సంక్షోభ సమయంలో రాజకీయ విమర్శలు చేయవద్దనే మౌనంగా ఉంటున్నామని తెలిపారు. వలస కార్మికుల విషయంలో కేంద్రం పట్టించుకోకున్నా సీఎం కేసీఆర్ మాత్రం వారిని రాష్ట్ర అభివృద్ధిలో వలస కార్మికులు భాగస్వాముని చెప్పారని గుర్తు చేశారు.
ఇండ్లపై పార్టీ జెండా ఎగరేయాలె..
పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ కార్యకర్తలు ఇండ్లపై పార్టీ జెండాలు ఎగరవేయాలని కేటీఆర్ కోరారు. ‘‘అందరూ ఎక్కడి వాళ్లక్కడే తమ ఇండ్లపై టీఆర్ఎస్ జెండా ఎగరేయాలి. కార్యకర్తలు సామాజిక దూరాన్ని పాటిస్తూ రక్తదాన కార్యక్రమాన్ని వారం పాటు కొనసాగించాలి. నేను కూడా రక్తదానం చేస్తున్నా..’’ అని చెప్పారు. కరోనా కష్టకాలంలో పేదలను ఆదుకోవాలని, తమ శక్తి మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళం ఇవ్వాలని కోరారు. అన్ని జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు సిద్ధమయ్యాయని, ప్రస్తుత సంక్షోభం ముగిశాక ప్రారంభోత్సవాలు, కార్యకర్తలకు ట్రైనింగ్ ఉంటాయని తెలిపారు.
స్ట్రాంగ్ లీడర్లం తయారైనం
కేసీఆర్ ట్రైనింగ్‌లో నేను, హరీశ్‌రావు, ఈటల రాజేందర్ వంటి స్ట్రాంగ్ లీడర్లం తయారైనం. ఇలాంటి నాయకత్వం ఇంకే పార్టీలోనూ లేదు. అన్ని పార్టీలు నాయకత్వ లేమిని ఎదుర్కొంటున్నయ్. పార్టీ ఆవిర్భావం, ఉద్యమ సమయంలో ఉన్న నాయకుల్లో కొందరు ఇప్పుడు దూరం కావడం సహజం. పార్టీ నిర్మాణ క్రమంలో కొందరు విభేదించి పక్కకు వెళ్లిపోయారు.. అలా కొందరు పార్టీకి దూరమైనా ప్రజలు ఇప్పటికీ కేసీఆర్ ను ఆశీర్వదిస్తున్నారు. అధికారంలోకి వచ్చాక ఫక్తు రాజకీయ పార్టీలా ఉంటామని కేసీఆర్ అన్నారు కదా, అందుకే వివిధ పార్టీల నేతలను చేర్చుకున్నాం.
దేశ రాజకీయాల్లో ఎంట్రీకి ఇంకాస్త టైముంది
కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లేందుకు ఇంకాస్త టైం ఉందని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ కార్యదక్షత, ప్రస్తుత పరిస్థితి చూస్తే మరో పది, ఇరవై ఏండ్లపాటు ఆయనే రాష్ట్రానికి సీఎంగా ఉండాలని తనతో పాటు చాలా మంది కోరుకుంటున్నారని చెప్పారు. ఉద్యమకారుడిగా, పాలనా దక్షుడిగా కేసీఆర్ సక్సెస్ ను చూసి ఎందరో కొనియాడారన్నారు. ఇలా ఏకకాలంలో పేరు తెచ్చుకోవడం కేసీఆర్ కు మాత్రమే చెల్లిందన్నారు.
