‘డిఫెన్స్’ భూములు ఇయ్యండి: రాజ్​నాథ్​ను కోరిన కేటీఆర్

‘డిఫెన్స్’ భూములు ఇయ్యండి: రాజ్​నాథ్​ను కోరిన కేటీఆర్

    రక్షణ మంత్రి రాజ్​నాథ్​ను కోరిన కేటీఆర్

    ఏవియేషన్​మంత్రి హర్దీప్ సింగ్ పురితోనూ భేటీ

    నేడు అమిత్ షా, పీయూష్ గోయల్ తో సమావేశం

న్యూఢిల్లీ, వెలుగు: స్ట్రాటజిక్ రోడ్​ డెవలప్​మెంట్​ప్లాన్ లో భాగంగా హైదరాబాద్​లో నిర్మించ తలపెట్టిన 2 స్కైవేల కోసం రక్షణ శాఖ భూములను అప్పగించాలని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు రక్షణ మంత్రి రాజ్​నాథ్​సింగ్​ను కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం రక్షణ మంత్రి రాజ్ నాథ్ ను కేటీఆర్ కలిశారు. హైదరాబాద్, -‌‌‌‌నాగ్ పూర్ నేషనల్​హైవే 44 మార్గంలో 39.4 ఎకరాలు, రామగుండం,-‌‌‌‌హైదరాబాద్ స్టేట్​ హైవే 1 రూట్​లో 66.37 ఎకరాలను రోడ్ల అభివృద్ధిలో భాగంగా బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. స్కైవేల నిర్మాణంతో హైదరాబాద్​లో ట్రాఫిక్ ఇబ్బందులు చాలావరకు తగ్గుతాయని తెలిపారు. ఆ తర్వాత కేంద్ర పట్టణాభివృద్ధి, సివిల్ ఏవియేషన్ మంత్రి హర్దీప్ సింగ్ పురితోనూ కేటీఆర్ భేటీ అయ్యారు.

తెలంగాణ శానిటేషన్ హబ్ ఏర్పాటుకు రూ.100 కోట్లు ఇవ్వాలని, ఈ హబ్ ఏర్పాటుతో శానిటేషన్ రంగంలో గుణాత్మక మార్పు సాధించే అవకాశం ఉందని, ఇది తెలంగాణకే కాకుండా ఇతర రాష్ట్రాలకూ ఉపయోగపడుతుందని ఆయనకు విజ్ఞప్తి చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో నిర్వహిస్తున్న ఘన వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టుకు స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా కేంద్రం ఆర్థిక సాయం అందించాలని కోరారు. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కోసం కేటాయించిన నిధుల్లో కేంద్రం నుంచి రావాల్సిన రూ.254 కోట్లను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. బేగంపేట్ ఎయిర్ పోర్ట్ లోని ఏఏఐకి చెందిన భవనాలను నామమాత్రపు అద్దెకు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని విజ్ఞప్తి చేశారు. గురువారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తో కేటీఆర్ భేటీ అయ్యే అవకాశం ఉంది.

ఇండస్ట్రియల్​ కారిడార్​ ఏర్పాటు చేయాలి

కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అధ్యక్షతన జరిగిన స్టేట్స్​ కన్సల్టేషన్​ వర్క్​షాప్​లో కేటీఆర్​ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానాలపై ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. హైదరాబాద్-, బెంగళూరు, -చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు విషయాన్ని పరిశీలించాలని కేంద్రాన్ని కోరారు. ఈ కారిడార్ ఏర్పాటుతో ఐటీ రంగంలో హైదరాబాద్, బెంగళూరుకు.. పారిశ్రామిక రంగంలో చెన్నైకి అనేక ప్రయోజనాలు ఉంటాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న 14 ప్రాధాన్యతా రంగాల్లో పెట్టుబడులను ఆకర్షిస్తున్న తీరును కేటీఆర్ వివరించారు. రాష్ట్రంలో టీఎస్ ఐపాస్, ఇతర పారిశ్రామిక విధానాల ద్వారా పారిశ్రామిక వర్గాలకు చేయూత అందిస్తున్నట్లు చెప్పారు.