అధికారం కోల్పోయి ప్రతిపక్షంగా మారిన దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీల అధినేతలు చాలామేరకు అసెంబ్లీకి రారని గత 40 ఏండ్ల చరిత్ర చెపుతోంది. మళ్లీ గెలిచి మాత్రమే అసెంబ్లీలో అడుగుపెడతానని గంభీరమైన శపథాలు చేసినవారూ ఉన్నారు. ఉత్తరాదిన అసెంబ్లీని బహిష్కరించిన ప్రాంతీయ పార్టీల అధినేతలు దాదాపు లేరనే చెప్పాలి. దక్షిణాది ప్రాంతీయ పార్టీల అధినేతలు మాత్రం అధికారం కోల్పోగానే ప్రతిపక్ష నేతగా అసెంబ్లీని బహిష్కరించడం ఒక దుస్సంప్రదాయంగా ఎందుకు మారుతోంది? తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ మూడు రాష్ట్రాల అసెంబ్లీల్లో ప్రాంతీయ పార్టీల అధినేతలు ప్రతిపక్ష నేతలుగా అసెంబ్లీని బహిష్కరించడమో లేదా గైర్హాజరు కావడమో అనేది దశాబ్దాలుగా సాగుతూ వస్తున్నది. కానీ, ప్రతిపక్ష పాత్రలో ఉండిన జాతీయ పార్టీలు మాత్రం అలా ఎన్నడూ చేసిన దాఖలాలు కనిపించవు. ప్రాంతీయ పార్టీల అధినేతలు మాత్రమే అలా ఎందుకు చేస్తున్నారనేదే చర్చించాల్సిన విషయం.
ప్రాంతీయ పార్టీ వ్యవస్థపాకుడు ఎవరైనా అధికారంలోకి వచ్చాక ఇక ఆ ప్రాంతం నాదే అనుకుంటారు. ప్రజలు శాశ్వతంగా నన్ను మాత్రమే గెలిపిస్తారనుకుంటారు! ఇతరులను గెలిపిస్తే అది మోసమని భావించడం వారి నైజంగా మార్చుకుంటారు. ఇదో రకమైన పొలిటికల్ ఇగో! ఇంకా చెప్పాలంటే, ప్రాంతంపై తమదే అధికారం అనుకునే అహంభావం పెంచుకుంటారు. ఓడితే మాత్రం ప్రతిపక్ష పాత్ర తమకో అవమానం అనుకుంటారేమో తెలియదు! కానీ, ప్రజలు అప్పగించిన పాత్రను ప్రజల కోసం బాగా పోషించి రాణిద్దాం అని మాత్రం అనుకోరు ఎందుకో? అధికారం చెలాయించినపుడు తమ ప్రాంతాన్ని అంతే బాగా పాలిస్తే ఓటమి ఎదురయ్యేది కాదు కదా అని మాత్రం అనుకోరు. ఓడించినందుకు ప్రజలనే తప్పుపడుతుంటారు. అయితే, దక్షిణాది ప్రాంతీయ పార్టీలన్నీ ధనిక పార్టీలే కావడం అందుకు ఓ కారణం!
పొలిటికల్ ఇగో!
1989 ఎన్నికల్లో ఎన్టీఆర్ అధికారం కోల్పోయాక. ప్రతిపక్ష నేతగా ఆయన అసెంబ్లీని బహిష్కరించారు. కారణం కాంగ్రెస్ నేతలు సభలో అవమానపరుస్తున్నారనే కారణంతో ఆయన సభను బహిష్కరించారు. ఎన్టీఆర్ ప్రాంతీయ పార్టీ పెట్టగానే 9 నెలలలోనే అధికారంలోకి వచ్చారు. ఆయనకు ప్రతిపక్ష పాత్ర అంటేనే తన ప్రతిష్టకు తగినది కాదనుకునేవారేమో! తాను ఓడించినవారే (కాంగ్రెస్) అధికారంలోకి రావడమేమిటి? తాను ప్రతిపక్షనేతగా పని చేయడమేమిటి ఆయన అనుకొని ఉండొచ్చు! తెలుగు ప్రజలు తెలుగుదేశాన్ని ఓడించడం ఏమిటి అనేది ఆయన అంతర్మథనం కావచ్చు! ప్రజాతీర్పును శిరసావహించి ప్రతిపక్ష నేతగా పనిచేయాలి అనే ధోరణి ఆయనలో కనిపించలేదు. ప్రాంతీయ పార్టీల అధినేతలు సహజంగానే ఓటమిని జీర్ణించుకోలేక పోతుంటారు. అదొక పొలిటికల్ ఇగో!
కరుణానిధి, జయలలిత
ప్రధాన పార్టీలు రెండూ ప్రాంతీయ పార్టీలే అయినపుడు వారి వైరానికి ఎల్లలు ఉండవు. అది వ్యక్తిగత ద్వేష రాజకీయాలుగా మారిపోతుంటాయి. కరుణానిధి, జయలలిత వైరం తెలిసిందే. ఇద్దరూ తమ తమ కాలంలో ప్రతిపక్ష నేతగా ఉండి సభను బహిష్కరించినవారే! ఆ తదుపరి ఎన్టీఆర్‌తో అదే సంప్రదాయం స్థిరపడింది. జగన్, చంద్రబాబు ధోరణి దాన్నివారసత్వంగా కొనసాగించింది. ఇపుడు కేసీఆర్‌దీ అదే దారి!
బాబు, జగన్‌లది అదే దారి!
2021లో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నపుడు చంద్రబాబు అసెంబ్లీని బహిష్కరించారు. తన భార్యను అవమానించేలా మాట్లాడారని అందుకే, మళ్లీ ముఖ్యమంత్రిగానే ఈ సభలో అడుగుపెడతానని శపథం చేశారు. అధికార పార్టీ, ప్రతిపక్షపార్టీ రెండూ ప్రాంతీయ పార్టీలే అయినపుడు దుర్భాషలే వాదాలుగా మారుతుంటాయి. చంద్రబాబు, జగన్మోహన్రెడ్డిల వైరం వ్యక్తి కేంద్రంగా మారింది. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి (వైసీపీ) పార్టీ ఓటమి
పాలయ్యింది. అయితే తనకు ‘ప్రధాన ప్రతిపక్ష నేత’ హోదా ఇవ్వడంలేదని సభకు వెళ్లడం మానేశారు. నిజానికి ప్రతిపక్ష హోదాకు సరిపోను అసెంబ్లీ స్థానాలు గెలవనందున ఆయనకు ప్రతిపక్ష హోదా దక్కలేదు. ప్రతిపక్ష పాత్ర పోషించడానికి సభ్యుల బలంతో పనిలేదు. మనం వినిపించే వాదనల్లో బలం ఉంటే చాలు! కానీ జగన్ కూడా చంద్రబాబు బాటలోనే అసెంబ్లీ బహిష్కరించారు. ప్రాంతీయ పార్టీల అధినేతలు ప్రతిపక్ష పాత్ర పోషించాలనుకోరు. ఏ వంక దొరికినా అసెంబ్లీని బహిష్కరించేద్దామనుకుంటారని చంద్రబాబు, జగన్‌ను చూస్తే తెలిసిపోతుంది!
కేసీఆర్ గైర్హాజరు ఎందుకో?
కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత ప్రతిపక్ష నేతగా ఆయన సంతకం పెట్టిపోవడం తప్ప సభలో సమస్యలపై మాట్లాడింది లేదు. ఒకరకంగా చెప్పాలంటే, సభను పరోక్షంగా బహిష్కరించినట్లే అని భావించవచ్చు. ప్రాంతీయ పార్టీల అధినేతల అసెంబ్లీ బహిష్కరణలకు మూడు కారణాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఒకటి పొలిటికల్ ఇగో. ఇది అత్యంత అహంభావానికి సంబంధించిన అంశం. ఆ రాష్ట్రం తన సొంతం అనే ప్యూడల్ భావనలో జీవిస్తుంటారు. అక్కడ ఓటమే ఎదురుకాదనుకునే మనస్తత్వం. దేశానికి అతీతమైన ఆలోచనలతో ఉండటం.దశాబ్దం పాటు పాలించిన కేసీఆర్ లాంటి వారు అంత తొందరగా ఓటమిని జీర్ణించుకోలేకపోవడం అనేది మొదటికారణం. తన పదేండ్ల పాలనలో భారీ అవినీతి జరిగిందనే ప్రతిపక్షాల ఆరోపణలు తనను అసెంబ్లీలో మరింత ఇబ్బంది పెడతాయనే అనుమానం ఉండటం మరో కారణం అయి ఉంటుంది.
హామీ ఇచ్చాక కూడా.. గైర్హాజర్ ఎందుకో?
అసెంబ్లీలో తాము ఎవరినీ బహిష్కరించం, సస్పెండ్ చేయం, అమర్యాదగా ప్రవర్తించం అని సభలో సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు ప్రకటించారు. అలాంటపుడు ప్రతిపక్షనేతగా హాజరుకావడానికి కేసీఆర్ వెనుకాడుతున్నారంటే.. మరేవో కారణాలు ఆయన్ను వెంటాడుతుండాలి. బహుశా అహంభావం అడ్డుపడడం, అవినీతిపై చర్చ ఇబ్బందిగా భావించడం అయి ఉండాలి! కారణం ఏదైనా కావచ్చు. ప్రాంతీయ పార్టీ అధినేతలో గూడుకట్టున్న అహంభావమే చాలా మేరకు అసెంబ్లీకి డుమ్మా కొట్టడానికి బలమైన కారణమని మాత్రం చెప్పొచ్చు. అహం బ్రహ్మస్మి . దాన్ని వదిలేసుకుంటేనే రాజకీయాల్లో తిరిగి రాణించే అవకాశాలు ఉంటాయనే విషయాన్ని కేసీఆర్ లాంటివారు మర్చిపోతున్నారు.
దక్షిణాది ప్రాంతీయ పార్టీల తీరువల్ల వ్యక్తి ధూషణలు పెరిగిపోవడం తప్ప, ప్రజల సమస్యలపై చర్చ కనిపించదు. అవినీతి ఆరోపణలు వినడం తప్ప దర్యాప్తులు శిక్షలు, రికవరీలు అంతకన్నా కనిపించవు. ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత తీరువల్ల తెలంగాణ ఒక ప్రధాన ప్రతిపక్ష పాత్ర లేని అసెంబ్లీగా మారింది. గత పదేండ్లు తాను నిజాయితీగా పాలించాననే నమ్మకమే ఉంటే, కేసీఆర్ అసెంబ్లీకి వచ్చేవారే కదా అని ప్రజల అభిప్రాయం. హాజరుకాకపోవడం వ్యక్తిగతంగా కేసీఆర్‌కు నష్టం కాకపోవచ్చు. కానీ, గత పదేండ్ల కేసీఆర్ ప్రభుత్వంలో అవినీతి జరిగిందా, ఇప్పటి ప్రభుత్వం సరిగా పనిచేస్తోందా అనే విషయాలు ప్రజలకు తెలియకుండా పోతున్నాయంటే.. కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కాకపోవడమే కారణమని మాత్రం చెప్పొచ్చు. అవమానాలకే భయపడితే, ఉత్తరాది ప్రాంతీయ పార్టీలు అసెంబ్లీలను ఎందుకు బహిష్కరించడంలేదు? దక్షిణాది ప్రాంతీయ పార్టీలే ఎందుకు బహిష్కరిస్తున్నాయో అందరూ ఆలోచించాలి. దక్షిణాదిన తమిళనాడు, ఆంధ్ర
ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల అధినేతల తీరు మన ప్రజాస్వామ్య వ్యవస్థలో క్షమార్హం కానిది. అసెంబ్లీల్లో ప్రతిపక్ష పాత్రకు ఎగనామం పెడుతున్న ప్రాంతీయ పార్టీల అధినేతల ధోరణితో ప్రాంతీయ పార్టీల పట్ల ప్రజల్లో మోజు తగ్గే అవకాశాలు మాత్రం రోజురోజుకూ పెరుగుతున్నాయనే చెప్పాలి.
అధినేతల్లో అహంభావం
ప్రాంతీయ పార్టీ ప్రాంతం కోసం పనిచేస్తుందనే విస్తృత అభిప్రాయం అందరికీ తెలిసిందే. స్థానిక అభివృద్ధి, ప్రజలు తమ ఆకాంక్షల కోసం వారిని నమ్మడం సహజం. కానీ, నేతీ బీరకాయలో నెయ్యి ఎంతో తెలియదు. కానీ, గెలిచాక అదే కోవలో పనిచేసేది తక్కువ, కుటుంబం కోసం పనిచేసేది ఎక్కువ అనేది దాదాపు అన్ని ప్రాంతీయ పార్టీల పట్ల ప్రజల్లో ఒక అభిప్రాయం ఇప్పటికే ఏర్పడింది. కేంద్రీకృత పరిపాలనతో అవకతవకలు, అవినీతి ఆరోపణలు వారు భారీగానే మోస్తుంటారు. ప్రాంతీయ పార్టీ అధినేత అధికారం కోల్పోయినపుడు సహనం కోల్పోవడం కూడా చూస్తున్నాం. ప్రజలు నన్నెలా ఓడించారు అని భావించడంలోనే వారి అహంభావం కనిపిస్తుంటుంది. ఒకోసారి ప్రజలనే నిందించే స్థాయికి వెళ్లిపోతుంటారు. అంతేకాదు, ఓడించిన ప్రజలనే నిందిస్తూ సేద తీరుతుంటారు కూడా! మళ్లీ గెలిచి అధికారం చేపట్టేంతవరకు అసెంబ్లీలోకి అడుగుపెట్టను అని శపథాలు చేసిన ప్రాంతీయ పార్టీల అధినేతలు కూడా మనకు కనిపిస్తారు.
- కల్లూరి శ్రీనివాస్‌రెడ్డి
సీనియర్ జర్నలిస్ట్
