- ఉత్తిదే అని తేలడంతో ఊపిరి పీల్చుకున్న లాయర్లు, జనాలు
వరంగల్, వెలుగు: వరంగల్ కోర్టుకు మరోసారి బాంబ్ బెదిరింపులు వచ్చాయి. గురువారం ఉదయం ఎప్పటిలాగే కేసులు చూసేందుకు జడ్జిలు, న్యాయవాదులు, వివిధ కేసుల్లో ఉన్న వారితో హనుమకొండ అదాలత్ జంక్షన్‍లోని కోర్ట్ రద్దీగా ఉంది. అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి కోర్టు అధికారులకు మెయిల్ ద్వారా బాంబ్ వార్నింగ్ వచ్చింది.
దీంతో వారు ముందస్తు చర్యల్లో భాగంగా సుబేదారి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వందలాది మంది న్యాయవాదులు కోర్ట్ గదుల నుంచి బయటకు రావడంతో గందరగోళం నెలకొంది. కాసేపటికే బాంబ్, డాగ్ స్వ్కాడ్ సిబ్బందితో రంగంలోకి దిగిన పోలీసులు రెండు గంటల పాటు తనిఖీలు నిర్వహించారు. బాంబ్ వార్నింగ్ ఫేక్ అని తేలడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
గుర్తు తెలియని వ్యక్తులు ఫేక్ ఐడీ నుంచి మెయిల్ పంపినట్లు ప్రాథమికంగా గుర్తించారు. గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు కోర్టులో ప్రొసీడింగ్స్ ఆగాయి. ఏడాది కింద ఓసారి, గత ఏడాది జూన్ 21న రెండోసారి.. ఇప్పుడు మూడోసారి ఇదే తరహాలో బెదిరింపులు రాగా, పూర్తి స్థాయి దర్యాప్తు చేయనున్నట్లు సుబేదారి పోలీసులు తెలిపారు.
