పెండింగ్ ప్రాజెక్టులను త్వరగా పూర్తిచేస్తాం : మంత్రి జూపల్లి కృష్ణారావు

పెండింగ్ ప్రాజెక్టులను త్వరగా పూర్తిచేస్తాం : మంత్రి జూపల్లి కృష్ణారావు
  • మంత్రి జూపల్లి కృష్ణారావు
  • హత్తిఘాట్ పంప్ హౌజ్, చనాకా కొరాట ప్రాజెక్టుల పరిశీలన

ఆదిలాబాద్, వెలుగు: రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు సమృద్ధిగా సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లా ఇన్​చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం హైదారాబాద్ నుంచి ప్రత్యేక హెలిక్యాప్టర్​లో ఆదిలాబాద్​జిల్లాలోని భీంపూర్, భోరజ్ మండలాల పరిధి హత్తిఘాట్ పంప్ హౌజ్, చనాకా–కొరాట ప్రాజెక్టులను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు.

అనంతరం హత్తిఘాట్ పంప్ హౌస్ వద్ద క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రాజెక్టు పనుల పురోగతిని సమీక్షించారు. చనాకా- కొరాట బ్యారేజ్ ద్వారా సాగునీటి ప్రయోజనాలపై ఇంజనీరింగ్ అధికారులతో చర్చించారు. ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర వివరాలు, జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని జిల్లా కలెక్టర్ రాజర్షి షా వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆదిలాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచి నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో సీఎం సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు పి.సుదర్శన్ రెడ్డి, టీజీఐఐసీ ఎండీ కె.శశాంక, ఎంపీ నగేశ్​, ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎస్పీ అఖిల్ మహాజన్, అడిషనల్ కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, మున్సిపల్ చైర్​పర్సన్ అనూష తదితరులు పాల్గొన్నారు. 

అభయ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి

బాల్య వివాహాల నిర్మూలనే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం చేపట్టిన ‘అభయ’ కార్యక్రమాన్ని చనాక కొరాట ప్రాకెక్టు వద్ద మంత్రి ప్రారంభించారు. ‘చిన్నారి బాల్యాన్ని కాపాడుకుందాం - బాల్య వివాహాలను నివారిద్దాం’ అనే నినాదంతో రూపొందించిన ఈ కార్యక్రమం ద్వారా బాల్య వివాహ నిరోధక చట్టం-2006పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించనున్నారు. ఈ సందర్భంగా చట్టానికి సంబంధించిన వివరాలు, అత్యవసర హెల్ప్​లైన్ నంబర్లు (1098, 112, 100) పొందుపరిచిన ప్రత్యేక పోస్టర్లను మంత్రి ఆవిష్కరించారు. బాల్య వివాహాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.