గిరిజనుల సమస్యలు పరిష్కరించని అధికారులపై ఫిర్యాదు చేయండి

 గిరిజనుల సమస్యలు పరిష్కరించని అధికారులపై ఫిర్యాదు చేయండి
  •  జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్​
  • మీటింగ్​కు రాని అధికారుల తీరుపై అసహనం

ఖానాపూర్, వెలుగు: గిరిజన గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొనే సమస్యలు తెలిసి కూడా పరిష్కరించని అధికారులపై తమకు ఫిర్యాదు చేయాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ అన్నారు. నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని ఆదివాసీ గిరిజన గ్రామాలు  రాంనగర్, పసుపులలో గురువారం ఆయన పర్యటించారు. గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాగా పెంబి పీహెచ్​సీలో పనిచేసే సిబ్బంది రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సర్పంచ్ స్వామి కమిషన్ సభ్యుడి దృష్టికి తీసుకెళ్లారు. ఆయా గ్రామాల్లో కరెంట్​సమస్యలను పరిష్కరించాలని, సిరిచెల్మ రోడ్డు నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా చూడాలని కోరారు.

ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. గిరిజన పేదల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా నేరుగా తనకు ఫిర్యాదు చేయాలన్నారు. గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు.

అయితే గిరిజన గ్రామాల్లో తన పర్యటన ఉన్నా ఆయా శాఖల జిల్లా అధికారులు రాకపోవడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితీశ్ రాథోడ్, మార్గదర్శి సొసైటీ అధ్యక్షుడు సురేందర్, నిర్మల్ డీటీడబ్ల్యూ అంబాజీ, ఎంపీడీవో సుధాకర్, తహసీల్దార్ లక్ష్మణ్, బీజేపీ మండల అధ్యక్షుడు వెంకటేశ్, ఆయా గ్రామాల సర్పంచ్​లు  తదితరులు పాల్గొన్నారు.