- 18న మేడారంలోనే మంత్రుల సమావేశం
- చరిత్రలో తొలిసారి.. ఉమ్మడి ఏపీలో లేని విధంగా వినూత్న అడుగు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పాలన సరికొత్త చరిత్రకు వేదిక కాబోతుంది. ఇప్పటివరకు సచివాలయానికే పరిమితమైన అత్యున్నత స్థాయి కేబినెట్ సమావేశం.. ఇప్పుడు అడవి బాట పట్టింది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క–-సారలమ్మల చెంతనే ఈసారి రాష్ట్ర మంత్రిమండలి సమావేశం నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ నెల 18న ములుగు జిల్లా మేడారంలో ఈ చారిత్రక భేటీ జరగనుంది. పాలనను ప్రజల వద్దకు తీసుకెళ్లడమే కాకుండా, గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని చాటిచెప్పేలా ఈ నిర్ణయం ఉండటం గమనార్హం. ఒక అటవీ ప్రాంతంలో, గిరిజన క్షేత్రంలో అధికారికంగా పూర్తిస్థాయి కేబినెట్ సమావేశాన్ని నిర్వహించడం తెలుగు రాష్ట్రాల చరిత్రలోనూ ఇదే మొదటిసారి అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
జాతర ఏర్పాట్లు.. బడ్జెట్ కసరత్తు
త్వరలో జరగనున్న మేడారం మహా జాతరకు లక్షలాదిగా తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేస్తున్నది. ఈ క్రమంలో కేబినెట్ సమావేశాన్ని అక్కడే నిర్వహించడం ద్వారా క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జాతర నిధులు, భద్రత, భక్తుల సౌకర్యాలపై ఈ భేటీలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. వీటితో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వివిధ శాఖల్లో అమలవుతున్న ఆరు గ్యారంటీలపై చర్చించే అవకాశం ఉంది.
సీఎం బిజీ షెడ్యూల్
ఈ నెల 18న మధ్యాహ్నానికి సీఎం మేడారం చేరుకుంటారు. కేబినెట్ భేటీ అనంతరం ఆ రాత్రికి అక్కడే బస చేస్తారు. 19న ఉదయం అమ్మవార్ల నూతన ప్రాంగణాలను ప్రారంభించి, దర్శనం చేసుకుంటారు. అనంతరం హైదరాబాద్ చేరుకుని, అదే రోజు సాయంత్రం ‘దావోస్’ పర్యటనకు వెళ్లనున్నారు.
