- ఫైనల్ ఓటర్ లిస్ట్ విడుదల చేసిన స్టేట్ ఎలక్షన్ కమిషన్
- రాష్ట్రంలో 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లు
- 20వ తేదీ కల్లా రిజర్వేషన్స్ ఖరారు చేసేలా కసరత్తు
- ఒకటి, రెండు రోజుల తేడాతో షెడ్యూల్ రిలీజ్‌కు ఎస్ఈసీ ఏర్పాట్లు
- ఫిబ్రవరి సెకండ్ వీక్‌లో ఎన్నికలు జరిగే అవకాశం
- ఈ నెల16 నుంచి ప్రచారానికి సిద్ధమైన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఓటర్ల లెక్క తేలింది. 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో 51.92 లక్షల మంది ఓటర్లు ఉన్నట్టు సోమవారం రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఫైనల్ ఓటర్లిస్టులను రిలీజ్ చేసింది. ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లతో పాటు జిల్లా కలెక్టరేట్లు, తహసీల్దార్ కార్యాలయాల ముందు ఈ ఓటర్ల జాబితాలను అధికారులు అంటించారు. ఫొటోలతో కూడిన ఓటర్ లిస్ట్‌ను ఈ నెల 16న రిలీజ్ చేయనున్నారు. ఓటర్ల లెక్క తేలడంతో ఇక ప్రభుత్వపరంగా రిజర్వేషన్లు తేల్చడమే మిగిలింది. 20వ తేదీ కల్లా చైర్మన్లు, వార్డుల వారీ రిజర్వేషన్లు ప్రకటించే అవకాశముంది. సర్కారు రిలీజ్ చేసిన రిజర్వేషన్లు చేతికందిన ఒకటి, రెండు రోజుల తేడాతో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్రిలీజ్కు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఫిబ్రవరి సెకండ్ వీక్‌లో ఎలక్షన్స్ పూర్తి చేసి మూడో వారంలోగా మున్సిపల్ పాలకవర్గాలు కొలువుదీరేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఈ నెల 16 నుంచి మున్సిపల్ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్ సిద్ధమయ్యారు. నాలుగు రోజుల పాటు జరిగే ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ను కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. ఇదే క్రమంలో బీజేపీ, బీఆర్ఎస్సైతం ఎన్నికల కసరత్తు ప్రారంభించాయి. మున్సిపాలిటీలవారీగా పార్టీ మీటింగులు పెడ్తూ బరిలో ఉన్న అభ్యర్థులను గుర్తిస్తున్నారు. అలాగే, బలమైన నేతలు చేజారకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.
పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ
రాష్ట్రంలో పాలకవర్గాల గడువు ముగిసిన 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో మొత్తం 51.92 లక్షల మంది ఓటర్లు ఉన్నట్టు సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇందులో 25 లక్షల 37 వేల 136 మంది పురుషులు, 26 లక్షల 54 వేల 453 మంది మహిళా ఓటర్లు, 631 థర్డ్ జెండర్లు ఉన్నట్టుగా వెల్లడించారు. పురుషుల కంటే లక్షా 17 వేల 317 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా గుర్తించిన ఫైనల్ ఓటర్ల లిస్టులను ఆయా బల్దియా కార్యాలయాలతో పాటు జిల్లా కలెక్టరేట్లు, తహసీల్దార్ కార్యాలయా దగ్గర అంటించారు. ఈ నెల 16న ఓటర్ల ఫొటోలతో కూడిన జాబితాలను ప్రకటించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ప్రకటించారు. 2019 మున్సిపల్ యాక్ట్ ప్రకారం ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేస్తున్నారు. అక్టోబర్ 1, 2025 వరకు అసెంబ్లీ నియోజకవర్గంలో నమోదైన ఓటర్ల జాబితాను అనుసరించి మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని వార్డుల వారీగా ఓటర్ల జాబితాను రెడీ చేయాలని గత నెల 29న రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, అధికారులు ఫైనల్ ఓటర్ల జాబితా రెడీ చేసి సోమవారం ఎన్నికల సంఘానికి పంపించారు.
123 బల్దియాల్లోనే ఎన్నికలు..
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను గ్రేటర్ హైదరాబాద్(జీహెచ్ఎంసీ) లో విలీనం చేసింది. దీంతో ప్రస్తుతం మున్సిపల్ శాఖ పరిధిలో 124 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లు మిగిలాయి. వీటిలో జీహెచ్ఎంసీ పాలకవర్గం గడువు ఫిబ్రవరితో ముగుస్తుంది. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, సిద్దిపేట, జడ్చర్ల, కొత్తూర్, అచ్చంపేట, నకిరేకల్ మున్సిపాలిటీల పాలవర్గం గడువు మే వరకు ఉన్నది. మందమర్రి, మణుగూరు మున్సిపాలిటీలు షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్నవి. ఈ పదిచోట్ల మినహా ఇంకా మిగిలిన 123 చోట్ల పాలకవర్గాల గడువు గతేడాది జనవరిలోనే ముగిసింది. ప్రస్తుతం ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతోంది. ఈ 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోనే ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
ఇక రిజర్వేషన్లే తరువాయి!
ఎన్నికలు నిర్వహించబోయే బల్దియాల్లో ఫైనల్ ఓటర్లిస్టులు ప్రకటించడంతో ఇక రిజర్వేషన్ల ప్రకటనే మిగిలి ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 20వ తేదీ కల్లా రిజర్వేషన్స్ ఖరారుచేసేలా కసరత్తు చేస్తోంది. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను 2011 జనాభా లెక్కల ప్రకారం, బీసీల రిజర్వేషన్లను డెడికేటెడ్ కమిషన్ ఆధారంగా ప్రకటించనున్నారు. ప్రభుత్వం రిజర్వేషన్లను అధికారికంగా ప్రకటించగానే ఒకటి, రెండు రోజుల తేడాతో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కు ఎస్ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఆయా మున్సిపాలిటీల్లో రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ల నియామకం కూడా పూర్తయింది. అంతా అనుకున్నట్లుగా జరిగితే ఫిబ్రవరి రెండోవారంలో ఎన్నికలు పూర్తి చేసి మూడో వారంలోగా పాలకవర్గాలను కొలువుదీరే అవకాశముంది.
