- డిసెంబర్ క్వార్టర్లో రూ.10,657 కోట్లు.. మొత్తం ఆదాయం రూ.67,087 కోట్లు
- రూ.57 చొప్పున మధ్యంతర డివిడెండ్
న్యూఢిల్లీ: ఐటీ సేవల కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) కన్సాలిడేటెడ్ నికర లాభం గత ఏడాది డిసెంబర్‌తో ముగిసిన మూడో క్వార్టర్లో ఏడాది లెక్కన 14 శాతం తగ్గి రూ.10,657 కోట్లకు పడిపోయింది. గత ఏడాది డిసెంబరు క్వార్టర్లో రూ.12,380 కోట్లు వచ్చాయి. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం ఐదు శాతం పెరిగి రూ.67,087 కోట్లకు చేరిందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. 2024 డిసెంబర్ క్వార్టర్లో రూ.63,973 కోట్ల ఆదాయం ఉంది. 2026 ఆర్థిక సంవత్సారినికి ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.57 మధ్యంతర డివిడెండ్ ప్రకటించారు. ఇందులో ఒక్కో షేరుకు రూ.11 చొప్పున మూడో మధ్యంతర డివిడెండ్, రూ.46 ప్రత్యేక డివిడెండ్ ఉన్నాయి. ఈ రెండు డివిడెండ్లను వచ్చే నెల ఫిబ్రవరి మూడున చెల్లిస్తారు. ఈ నెల 17ను రికార్డు తేదీగా నిర్ణయించారు. రెండో క్వార్టర్ లో ఉన్న రూ.12,075 కోట్లతో పోలిస్తే టీసీఎస్ నికర లాభం 12 శాతం తగ్గింది. ఇదేకాలంలో ఆదాయం రూ.65,799 కోట్లతో పోలిస్తే రెండు శాతం పెరిగింది.
వృద్ధి కొనసాగిందన్న ఎండీ
కంపెనీ ఫలితాలపై ఎండీ, సీఈఓ కృతివాసన్ మాట్లాడుతూ రెండో క్వార్టర్‌లో కనిపించిన వృద్ధి మూడో క్వార్టర్ లోనూ కొనసాగిందని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ ఆధారిత సాంకేతిక సేవల సంస్థగా ఎదగాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. తమ ఏఐ సేవలతో ఏటా 1.8 బిలియన్ డాలర్లు వస్తున్నాయని చెప్పారు. ఇదిలా ఉంటే, కొత్త లేబర్ కోడ్ల వల్ల కంపెనీపై రూ.2,128 కోట్ల భారం పడింది. ఏఐ సేవల ఆదాయం సీక్వెన్షియల్‌గా 17.3 శాతం వృద్ధి సాధించింది. ఆపరేటింగ్ మార్జిన్ 25.2 శాతం, నికర మార్జిన్ 20 శాతం ఉన్నాయి. గత నెల 31 నాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 11,151 తగ్గి 5,82,163 కి చేరినట్లు టీసీఎస్ వెల్లడించింది.
