ఇండియానా: అమెరికాలో జరిగిన గ్యాంగ్‌వార్‌లో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కీలక అనుచరుడు చనిపోయాడు. మృతుడిని హర్యానాకు చెందిన వీరేందర్ సంభిగా గుర్తించారు. ఇతడు బిష్ణోయ్‌కి అత్యంత సన్నిహితుడని దర్యాప్తు అధికారులు తెలిపారు.
సోమవారం అమెరికాలోని ఇండియానా స్టేట్‌లో జరిగిన ఈ గ్యాంగ్‌వార్‌లో బిష్ణోయ్ అనుచరుల్లో మరొకరికి బులెట్ గాయాలయ్యాయి. దాడి జరిపిన కొద్ది గంటల తర్వాత రోహిత్ గోదారా నేతృత్వంలోని రైవల్ గ్యాంగ్ ఈ ఘటనపై స్పందించింది. తామే బిష్ణోయ్ మనిషిని చంపేశామని చెప్పింది.
తన గ్యాంగ్‌కు చెందిన బల్జోత్ సింగ్, జస్సా అనే ఇద్దరు గ్యాంగ్‌స్టర్లు వీరేందర్ సంభిని చంపేశారని ఫేస్‌బుక్ ద్వారా ప్రకటించింది. ‘‘లారెన్స్ బిష్ణోయ్ పెద్ద ద్రోహి. చూస్తుండండి.. అతడికి మరెన్నో సర్ప్రైజ్లిస్తం” అని బల్జోత్ సింగ్ పోస్ట్ పెట్టాడు.
