ముంబై: ‘ఇండియా, అమెరికా మధ్య నిజమైన స్నేహం ఉంది. నిజమైన స్నేహితుల మధ్య విభేదాలు ఉన్నా, వాటిని పరిష్కరించుకోగలుగుతారు”..ఇండియాకు అమెరికా కొత్త రాయబారి సెర్జియో గోర్ చేసిన ఈ కామెంట్స్‌తో సోమవారం మార్కెట్‌లో ఒక్కసారిగా సీన్ రివర్స్ అయ్యింది. ఇంట్రాడేలో 700 పాయింట్ల వరకు పడ్డ సెన్సెక్స్, గంటలోనే నష్టాలను తగ్గించుకుంది. చివరికి 300 పాయింట్ల ప్రాఫిట్‌తో సెషన్‌ను ముగించింది. ఇండియా, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతాయని గోర్ కామెంట్ చేయడంతో ఇన్వెస్టర్ల కాన్ఫిడెన్స్ బలపడింది. సెన్సెక్స్ సోమవారం 302 పాయింట్లు (0.36 శాతం) పెరిగి 83,878 వద్ద, నిఫ్టీ 107 పాయింట్లు లాభపడి 25,790 వద్ద సెటిలయ్యాయి.
పాక్స్‌సిలికాతో మరింత ముందుకు..
సిలికాన్ సప్లయ్ చెయిన్‌ను బలపరిచేందుకు అమెరికా నడిపిస్తున్న ఇనీషియేటివ్ పాక్స్‌సిలికాకు ఇండియాను గోర్ ఆహ్వానించారు. ‘‘వచ్చే నెల నుంచి పాక్స్‌సిలికాలో పూర్తి స్థాయి మెంబర్‌గా ఇండియా చేరాలని ఆహ్వానిస్తున్నా”అని ఆయన పేర్కొన్నారు. ఇందులో జపాన్, సౌత్ కొరియా, యూకే, ఇజ్రాయెల్ మెంబర్లుగా ఉన్నాయని అన్నారు. ఈ ఆహ్వానంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లతో పాటు బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ మిడ్‌క్యాప్ 100, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 ఇండెక్స్‌లు కూడా సోమవారం లాభాల్లో ముగిశాయి. ట్రంప్ 500శాతం టారిఫ్ వేస్తానని గతంలో వార్నింగ్ ఇవ్వడంతో ఎగుమతులపై ఆధారపడే కంపెనీల షేర్లు ఒత్తిడిలో ఉన్నాయి. గోర్ కామెంట్స్‌తో ఇవి సోమవారం తమ సెషన్ గరిష్టాల వద్ద సెటిలయ్యాయి. అంతేకాకుండా గత ఐదు సెషన్లుగా మార్కెట్ పడడంతో కూడా వాల్యూ బయ్యింగ్ కనిపించింది. గత ఐదు సెషన్లలో సెన్సెక్స్ 2,186 పాయింట్లు (2.54 శాతం) పతనమైంది.
వెండి ధర ఒక్కరోజే రూ.15 వేలు పైకి
ఢిల్లీలో వెండి ధరలు సోమవారం కిలోకి రూ.15 వేలు పెరిగి రూ.2,65,000 చేరి ఆల్‌టైమ్ హై సాధించాయి. బంగారం (24క్యారెట్స్) కూడా 10 గ్రాములకు రూ.2,900 పెరిగి రూ.1,44,600కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ తొలిసారి ఔన్స్ (28 గ్రాముల) కు 4,600 డాలర్లు దాటగా, వెండి 84.61 డాలర్లకి చేరింది.
