- ఇరాన్ లీడర్లే ఫోన్ చేశారన్న అమెరికా అధ్యక్షుడు
- ఆ దేశంతో గొప్ప డీల్ కుదుర్చుకుంటామని వెల్లడి
- యుద్ధమైనా, చర్చలకైనా మేం రెడీ: ఇరాన్
- మీ ప్రయోజనాలు మాపై రుద్దితే ఊరుకోబోమని క్లారిటీ
దుబాయ్: అమెరికా బెదిరింపులకు ఇరాన్ దిగొచ్చిందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ నాయకత్వం తనను సంప్రదించిందని, తమతో చర్చలు జరపాలని కోరుకుంటున్నదని వెల్లడించారు. ఇరాన్ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసేందుకు తన యంత్రాంగం ప్రయత్నిస్తున్నదని పేర్కొన్నారు. అయితే.. ఇరాన్ భద్రతాబలగాల చేతుల్లో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని విచారం వ్యక్తం చేశారు. ఇది ఇలాగే కొనసాగితే ఇరాన్ ప్రతినిధులతో సమావేశంకంటే ముందే తాము వైమానిక దాడులు చేయాల్సి ఉంటుందేమో అని హెచ్చరించారు. ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ‘‘ఇరాన్‌లో ఖమేనీ నియంత పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల్లో ఇప్పటి దాకా 544 మంది చనిపోయారు. వీరిలో సుమారు 496 మంది నిరసనకారులు కాగా, మిగతా 48 మంది భద్రతా దళాలకు చెందిన వారు ఉన్నారు. చర్చల కోసం ఇరాన్ లీడర్లు నాకు ఫోన్ చేశారు. అమెరికా చేతిలో దెబ్బలు తినడం వారికి విసుగు తెప్పించి ఉంటది. అందుకే వెనక్కి తగ్గారు. ఇరాన్ తన పరిమితులు దాటినట్లుగా కనిపిస్తున్నది. అక్కడి లీడర్లు కేవలం హింస ద్వారానే దేశాన్ని పాలిస్తున్నారు. అయితే, ఆ దేశ పరిస్థితిని మా సైన్యం ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నది. సమస్య పరిష్కారం కోసం బలమైన ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నాం. ఇరాన్ లీడర్లతో సమావేశానికి ముందే మేం చర్యలు తీసుకోవాల్సి
రావొచ్చు కూడా. అయితే, వారితో ఒక సమావేశం మాత్రం జరుగుతుంది’’ అని ట్రంప్ పేర్కొన్నారు.
ప్రజలపై దాడులు చేస్తే ఊరుకునేది లేదు
ఇరాన్.. తమ దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకోవడానికి, అమెరికా ఆంక్షల నుంచి రిలీఫ్ పొందడానికి రాజీకి రావాలని కోరుకుంటున్నదని ట్రంప్ తెలిపారు. ‘‘ఒకవైపు చర్చలు అంటూనే, మరోవైపు సొంత ప్రజలపై దాడులు చేయడాన్ని అంగీకరించం. ఇరాన్‌తో గొప్ప డీల్ కుదుర్చుకోవడానికి రెడీగా ఉన్నా. అయితే, అది అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాలి. అణ్వాయుధాల తయారీని, టెర్రరిజానికి సపోర్ట్ చేయడాన్ని ఇరాన్ పూర్తిగా ఆపేయాలి. ఇవే నా ముఖ్యమైన షరతులు. ఇరాన్‌లో ఇంటర్నెట్ సేవలు ఆపేశారు. దీనిపై నేను ఎలాన్ మస్క్‌తో మాట్లాడాలనుకుంటున్నా’’ అని ట్రంప్ పేర్కొన్నారు. కాగా, ఇరాన్‌లో జరుగుతున్న నిరసనల గురించి ప్రపంచానికి తెలియకుండా అడ్డుకోవడానికి ఖమేనీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దేశంలో ఇంటర్నెట్ సేవలను నిలిపేసింది. మస్క్ అందిస్తున్న స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ప్రజలు వినియోగించుకోకుండా ‘కిల్ స్విచ్’ వంటి లేటెస్ట్ టెక్నాలజీ సాయంతో అడ్డుకుంటోంది.
ఏపక్షంగా వాదిస్తే చర్చించేది లేదు: ఇరాన్ మంత్రి
దేశంలో పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చాయని ఇరాన్ మంత్రి అబ్బాస్ అరాఘ్చి ప్రకటించారు. ట్రంప్ చేసిన కామెంట్లపై అబ్బాస్ ఘాటుగానే స్పందించారు. ‘‘మేము యుద్ధానికి సిద్ధం.. చర్చలకు కూడా సిద్ధం’’అంటూ ట్రంప్ హెచ్చరికలపై అరాగ్చీ కామెంట్ చేశారు. ‘‘ఇరాన్ యుద్ధాన్ని కోరుకోవడం లేదు.. కానీ, యుద్ధం వస్తే ఎదుర్కోవడానికి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంది. గతంలో జరిగిన ఘర్షణల కంటే ఇప్పుడు మేము మరింత పటిష్టంగా ఉన్నాం. ఇక్కడ జరుగుతున్న నిరసనలను సాకుగా చూపి మా దేశ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. మా దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ట్రంప్ చెప్పినట్లు చర్చలు జరపడానికి ఇరాన్ వ్యతిరేకం కాదు.. అయితే, చర్చలు ‘పరస్పర గౌరవం’ ఆధారంగా జరగాలి. అమెరికా తన ఎజెండాను ఇరాన్‌పై రుద్దకూడదు. ఏకపక్షంగా లేదా అమెరికా చెప్పింది వినేలా ఉండే చర్చలకు మేము సిద్ధంగా లేము’’ అని అబ్బాస్ స్పష్టం చేశారు. ఇరాన్‌లో చెలరేగిన హింస వెనుక అమెరికా, ఇజ్రాయెల్ హస్తం ఉందని పరోక్షంగా ఆరోపించారు. వారు కావాలనే పరిస్థితిని ఉద్రిక్తం చేస్తున్నారని మండిపడ్డారు.
