కబ్జాకోరులపై ఉక్కుపాదం.. పేదలు, ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే కఠిన చర్యలు: మంత్రి పొంగులేటి

కబ్జాకోరులపై ఉక్కుపాదం.. పేదలు, ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే కఠిన చర్యలు: మంత్రి పొంగులేటి
  •     కూకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లిలో సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజిస్ట్రార్ ఆఫీస్​ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖను సమూలంగా ప్రక్షాళన చేస్తామని, అవినీతికి తావులేకుండా పారదర్శక సేవలు అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి అన్నారు. సోమవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కూకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లిలో ఎస్ఎస్ఆర్ బిల్డర్స్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న సమీకృత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి ఆయన శంకుస్థాపన చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. పేదల భూములను, ప్రభుత్వ భూములను కబ్జా చేయాలనుకునే అక్రమార్కుల భరతం పట్టి, వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. ప్రజలకు ఇబ్బందుల్లేకుండా, కార్పొరేట్ స్థాయి వసతులతో రాష్ట్రవ్యాప్తంగా సమీకృత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లోని 39 కార్యాలయాలను 12 క్లస్టర్లుగా విభజించి భవనాలు నిర్మిస్తారని వెల్లడించారు. 

రెండో విడతలో జిల్లా కేంద్రాల్లో, మూడో విడతలో నియోజకవర్గ కేంద్రాల్లో ఈ భవనాలు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. గచ్చిబౌలిలోని ‘తాలిమ్’ భవనంలో చేపట్టిన నిర్మాణాన్ని జూన్ నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, కూకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, నవీన్ రావు, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు, బిల్డర్ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.