- జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రాంచందర్
వేములవాడ, వెలుగు:- ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం చేకూర్చాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రాంచందర్ ఆదేశించారు. సోమవారం ఆయన వేములవాడ పట్టణానికి రాగా.. ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్బి.గీతే ఘన స్వాగతం పలికారు. అనంతరం భీమేశ్వర ఆలయ సమీపంలోని అతిథి గృహంలో అధికారులతో కలిసి వివిధ పథకాలు, అట్రాసిటీ కేసులపై రివ్యూ చేశారు.
ఈ సందర్భంగా రాంచందర్ మాట్లాడుతూ అట్రాసిటీ కేసుల్లో ఎంక్వైరీ వేగంగా పూర్తి చేసి చార్జీషీట్ వేస్తే బాధితులకు న్యాయం జరుగుతుందన్నారు. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఎస్టీ పథకాల ప్రయోజనాలు అందిపుచ్చుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలోని ఎస్సీ సంక్షేమ హాస్టళ్లలో ఎంత మంది విద్యార్థులు చదువుతున్నారు? మెనూ, అంబేద్కర్ ఓవర్సీస్ విదేశీ విద్యా నిధి, కులాంతర వివాహాలకు ప్రోత్సాహకంపై ఆరా తీశారు.
భీమేశ్వర ఆలయంలో పూజలు
జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రాంచందర్ భీమేశ్వర ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఆలయ అర్చకులు ఆశీర్వచనం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం బద్ది పోచమ్మ అమ్మవారికి పూజలు చేశారు. కార్యక్రమంలో ఈఓ రమాదేవి, ఏఎస్పీ రుత్విక్ సాయి, ఆర్డీవో రాధాభాయ్, తహసీల్దార్ విజయ ప్రకాశ్‌రావు, ఇన్‌చార్జి ఎస్సీ సంక్షేమ అధికారి రవీందర్ రెడ్డి, ఏఎస్‌డబ్ల్యూవో విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
