- మంత్రి శ్రీధర్ బాబు
మంథని, వెలుగు: మంథనిని మోడల్‌గా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. సోమవారం మంథని పట్టణంలోని సుమారు రూ.45కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో మంథని ప్రజలకు సేవలందించడానికి ఎల్లప్పుడు ముందుంటానని తెలిపారు.
మంథని నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడం పూర్వజన్మ సుకృతమని ఆయన తెలిపారు. గంగపురి– బోయిన్‌పేట వాసుల కష్టాలు తీరడానికి బ్రిడ్జి నిర్మిస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు.
అనంతరం మంత్రి శ్రీధర్ బాబు లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు, ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలు అందజేశారు. నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు వచ్చేలా కృషి చేస్తానన్నారు. రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులు, ప్రభుత్వ పెద్దలపై సోషల్ మీడియాలో వచ్చిన కథనాలు బాధకరమని వాటిని ఖండిస్తున్నట్లు చెప్పారు. లీడర్లు వెంకన్న, కాచే, ప్రసాద్, శివ, ఒడ్నాల శ్రీనివాస్, కొత్త శ్రీనివాస్, కిరణ్ గౌడ్, పాల్గొన్నారు.
జర్నలిస్టుల సంక్షేమానికి సహకరిస్తాం
మంథని పట్టణ కేంద్రంలోని ఎలక్ట్రాన్ మీడియా డివిజన్ ప్రెస్ క్లబ్‌ను మంత్రి శ్రీధర్ బాబు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీడియా స్వేచ్ఛను ప్రభుత్వం ఎల్లప్పుడూ గౌరవిస్తుందన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి తమ వంతు సహకారం అందిస్తామని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు.
