న్యూఢిల్లీ: కిందటేడాది జరిగిన మొత్తం వాహనాల రిజిస్ట్రేషన్లలో ఎలక్ట్రిక్ బండ్ల వాటా 8శాతానికి పెరిగింది. వాహన్ పోర్టల్ ప్రకారం, ఈవీ అమ్మకాలు 23 లక్షల యూనిట్లకు చేరాయి. ఇందులో 12.8 లక్షల టూవీలర్లు ఉన్నాయి. ఈవీల అమ్మకాల్లో ఈ సెగ్మెంట్ వాటా 57శాతంగా ఉంది. 8 లక్షల త్రీ-వీలర్లు (ఎల్3, ఎల్5) (35శాతం వాటా), 1.75 లక్షల ఫోర్ వీలర్లు అమ్ముడయ్యాయి.
భారత ఆటోమొబైల్ మార్కెట్ 2025లో 2.82 కోట్ల రిజిస్ట్రేషన్లు నమోదు చేసింది. అందులో 72శాతం టూ-వీలర్లు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో వెహికల్ రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరిగాయి. చిన్న రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్లు భారీగా జరిగాయి. కిందటేడాది ఇండియా ఈవీ రంగం 1.4 బిలియన్ డాలర్ల నిధులు సమీకరించింది. అందులో 1.2 బిలియన్ డాలర్లు కంపెనీలు సమీకరించాయి.
