పోలవరం–నల్లమలసాగర్‌‌‌‌ ప్రాజెక్టు బచావత్ అవార్డుకు విరుద్ధం

పోలవరం–నల్లమలసాగర్‌‌‌‌ ప్రాజెక్టు బచావత్ అవార్డుకు విరుద్ధం
  • సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం వాదనలు
  • ఏపీ విభజన చట్టంలోని రెండు సెక్షన్లకు విరుద్ధంగా ప్రాజెక్ట్​ విస్తరణ
  • రాష్ట్రాలు, కేంద్ర సంస్థల అనుమతులు లేకుండానే ఏపీ పనులు
  • ఈ లెక్కన రిట్‌‌కు విచారణార్హత ఉన్నదని కోర్టుకు తెలిపిన తెలంగాణ సర్కారు
  • కర్నాటక, మహారాష్ట్రలకూ బచావత్​ కేటాయింపులున్నయన్న కోర్టు
  • ఆ రెండు రాష్ట్రాలనూ చేర్చి సూట్​ ఫైల్​ చేయాలని  సూచన

హైదరాబాద్, వెలుగు: ఏపీ ప్రభుత్వం చేపడుతున్న పోలవరం –నల్లమలసాగర్​ లిఫ్ట్​ ప్రాజెక్ట్​ (పీఎన్‌‌ఎల్‌‌పీ).. గోదావరి ట్రిబ్యునల్ (బచావత్​)​ అవార్డు (కేటాయింపుల)కు విరుద్ధమని సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. గోదావరి ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డు మేరకు.. కేంద్రజలశక్తి శాఖ పోలవరం ప్రాజెక్టుకు ఇచ్చింది 484.5 (404.5+80 గోదావరి డైవర్షన్​) టీఎంసీలేనని, అంతకుమించి వాడుకోవడానికి లేదని తేల్చి చెప్పింది. 

వరద జలాల పేరిట ఏపీ ప్రభుత్వం అంతకుమించి ఔట్ సైడ్​ బేసిన్‌‌కు తరలించే ప్రయత్నం చేస్తున్నదని, అది బచావత్​ ట్రిబ్యునల్​ అవార్డును ఉల్లంఘించడమే అవుతుందని స్పష్టం చేసింది. ఏపీ చేపడుతున్న ఆ ప్రాజెక్టును ఆపాలంటూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్​ పిటిషన్‌‌ను సోమవారం సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్​ సూర్యకాంత్​, జస్టిస్​ జోయ్​మాల్య బాగ్చిల బెంచ్‌‌ విచారించింది.  

ఆర్టికల్​ 32 ప్రకారం ఈ పిటిషన్‌‌కు విచారణార్హత లేదని సీజేఐ జస్టిస్​ సూర్యకాంత్​ మరోసారి స్పష్టం చేశారు. రిట్‌‌లో పేర్కొన్న అంశాలతో సివిల్​ సూట్​ ఫైల్​ చేయాలని సూచించారు. తెలంగాణ వాదనలపై స్పందించిన జస్టిస్​ బాగ్చి.. బచావత్​ ట్రిబ్యునల్​ అవార్డు కేవలం ఏపీ, తెలంగాణలకే నీటి కేటాయింపులు చేయలేదని, మహారాష్ట్ర, కర్నాటకలకూ కేటాయించిందని గుర్తుచేశారు. 

కానీ, రిట్​ పిటిషన్‌‌లో ఆ రెండు రాష్ట్రాలను రెస్పాండెంట్స్‌‌గా చేర్చలేదని పేర్కొన్నారు. దీంతో ఆ రెండు రాష్ట్రాలనూ పార్టీ స్టేట్స్‌‌గా పేర్కొంటూ సూట్​ వేయాలని తెలంగాణకు సీజేఐ సూచించారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అడ్వకేట్​అభిషేక్​ మనుసింఘ్వీ.. రిట్ ​పిటిషన్‌‌ను వెనక్కు తీసుకుంటామని చెప్పారు. సూట్​ దాదాపు రెడీ అయిందని, ఫైల్​ చేస్తామని కోర్టుకు  తెలిపారు.  

రాష్ట్ర హక్కులకు నష్టం..

పోలవరం పనులను నిలుపుదల చేయాలంటూ 2011లో కేంద్ర పర్యావరణ శాఖ ఏపీకి నోటీసులిచ్చిందని, కానీ, ఎలాంటి కంప్లయన్స్​ లేకుండానే ఆ ఆదేశాలను కేంద్రం పక్కనపెట్టిందని కోర్టుకు తెలంగాణ తెలిపింది. దీంతో ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఆ పోలవరం ప్రాజెక్టును సామర్థ్యానికి మించి విస్తరించుకుంటున్నదని, దాని వల్ల తెలంగాణ జల ప్రయోజనాలకు నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. 

ఇలాంటి ప్రాజెక్టులు చేపట్టేటప్పుడు సభ్య రాష్ట్రాలు, అపెక్స్​ కౌన్సిల్,​ కృష్ణా, గోదావరి బోర్డులు, కేంద్ర జలశక్తిశాఖ, సెంట్రల్​ వాటర్​ కమిషన్​, పోలవరం ప్రాజెక్ట్​ అథారిటీల అనుమతి తప్పనిసరి అని ఏపీ పునర్విభజనచట్టంలోని సెక్షన్​ 84(3)(ii), సెక్షన్​ 85(8)(డీ)  స్పష్టం చేస్తున్నాయని, కానీ, ఇప్పుడు ఆ సెక్షన్లకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం ఎవరి అనుమతులు లేకుండానే ఏకపక్షంగా ప్రాజెక్టును చేపడుతున్నదని తెలంగాణ అభ్యంతరం తెలిపింది.

రిట్‌‌కు అర్హతలున్నయ్​.. 

కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ సంస్థల అనుమతుల్లేకుండా ఎలాంటి ప్రాజెక్టులు చేపట్టరాదని పేర్కొంటూ 2017, 2025లో సీడబ్ల్యూసీ​ ఇచ్చిన గైడ్‌‌లైన్స్​కు వ్యతిరేకంగా ప్రాజెక్టును ఏపీ ముందుకు తీసుకెళ్తున్నదని తెలంగాణ వాదించింది. ప్రస్తుతం పోలవరం - నల్లమలసాగర్​ కేసులో అన్ని కేంద్ర సంస్థలూ ఇన్వాల్వ్​ అయ్యాయని, సీడబ్ల్యూసీ గైడ్‌‌లైన్స్‌‌కు విరుద్ధంగా ఏపీ తీరు ఉన్న నేపథ్యంలో ‘రిట్​’ కింద ఈ కేసును సుప్రీంకోర్టు విచారించేందుకు అవకాశం ఉందని ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. 

ఇది వాటర్​ డిస్ప్యూట్​ కాదని, సూట్​ వేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నది. తమిళనాడు ముళ్లపెరియార్​ డ్యామ్​ కేసు (పర్యావరణ అనుమతులకు సంబంధించి), గోదావరి నీళ్లను ఏపీ ఏకపక్షంగా తరలించుకుపోవడం పై ఒడిశా వేసిన కేసులను ఆర్టికల్​ 32 ప్రకారమే రిట్​ కింద విచారించిన విషయాన్ని గుర్తు చేసింది.