భారత్ కన్నా మాకు ఏ దేశమూ ఎక్కువ కాదు : యూఎస్ రాయబారి సెర్గియో గోర్

భారత్ కన్నా మాకు  ఏ దేశమూ ఎక్కువ కాదు :   యూఎస్ రాయబారి సెర్గియో గోర్
  • ఇండియా, అమెరికా రియల్  ఫ్రెండ్స్
  •     యూఎస్ రాయబారి సెర్గియో గోర్

    
న్యూఢిల్లీ: భారత్ కన్నా తమకు ఏ దేశమూ ఎక్కువ కాదని అమెరికా రాయబారి సెర్గియో గోర్ పేర్కొన్నారు. ఇండియా, అమెరికా రియల్  ఫ్రెండ్స్  అని ఆయన చెప్పారు. మిత్రుల మధ్య విభేదాలు ఉంటాయని, చర్చల ద్వారా అభిప్రాయ భేదాలను వారు పరిష్కరించుకుంటారని చెప్పారు. ఢిల్లీలోని అమెరికా ఎంబసీలో గోర్‌‌‌‌ మాట్లాడారు. సోమవారం అమెరికా, భారత్  తమ తదుపరి వాణిజ్య ఒప్పంద చర్చలను మళ్లీ ప్రారంభించాయని తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో తమ దేశ అధ్యక్షుడు డొనాల్డ్  ట్రంప్  స్నేహం నిజమని చెప్పారు. 

ఈ సంవత్సరం చివరలో లేదా వచ్చే ఏడాది భారత్ లో ట్రంప్  పర్యటిస్తారని వెల్లడించారు. ‘‘భారత్, అమెరికా స్నేహం ఈనాటిది కాదు. ప్రపంచంలోనే అత్యధిక జనాభాగల దేశం భారత్. రెండు దేశాలకూ వాణిజ్యం చాలా ప్రధానమైనది. సెక్యూరిటీ, టెర్రరిజంపై పోరాటం, ఎనర్జీ, టెక్నాలజీ, ఎడ్యుకేషన్, హెల్త్  వంటి కీలక రంగాల్లో రెండు దేశాలు కలిసి పనిచేస్తాయి. అలాగే, పరస్పర గౌరవం, లీడర్ షిప్ తో రెండూ వ్యూహాత్మక భాగస్వాములుగా కొనసాగుతాయి. ఇండియా మాకు అత్యంత కీలకమైన భాగస్వామి. అలాంటి దేశంతో భాగస్వామ్యం మాకు చాలా అవసరం. ప్రస్తుతం రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం, వాణిజ్య ఒప్పందం విజయవంతం అయ్యేలా అమెరికా రాయబారిగా నేను కృషిచేస్తా” అని గోర్  వ్యాఖ్యానించారు. కాగా.. భారత్ లో అమెరికా రాయబారిగా గోర్ ను ట్రంప్  నియమించారు. దీనితో పాటు యూఎస్  ఎంబసీలో దక్షిణ, మధ్య ఆసియాకూ ప్రత్యేక రాయబారిగా ఆయన వ్యవహరిస్తారు.