తల్లిని హత్య చేసిన కొడుకు..పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌‌ మండలంలో ఘటన

తల్లిని హత్య చేసిన కొడుకు..పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌‌ మండలంలో ఘటన

సుల్తానాబాద్, వెలుగు : తరచూ మందలిస్తుందన్న కోపంతో పాటు ఆస్తి కోసం ఓ దత్తపుత్రుడు తన తల్లిని హత్య చేశాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌‌ మండలంలో సోమవారం వెలుగు చూసింది. ఎస్సై చంద్రకుమార్‌‌ తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని నీరుకుళ్ల గ్రామపంచాయతీ పరిధిలోని కోమండ్లపల్లి గ్రామానికి చెందిన ఐలవేణి భాగ్యమ్మ (64), రాజయ్య దంపతులకు సంతానం కలగలేదు. దీంతో రాజయ్య తమ్ముడు నర్సయ్య కుమారుడైన సాయిని దత్తత తీసుకొని పెంచుకున్నారు. 

రాజయ్య అనారోగ్యంతో నాలుగు నెలల కింద చనిపోయాడు. ఇదిలా ఉండగా... మద్యానికి బానిసైన సాయి ఎలాంటి పనులు చేయకుండా జులాయిగా తిరుగుతుండడంతో భాగ్యమ్మ తరచూ మందలించేది. దీనిని మనసులో పెట్టుకున్న సాయి భాగ్యను హత్య చేస్తే నాలుగు ఎకరాల భూమితో పాటు మిగతా ఆస్తి కూడా తనకే దక్కుతుందని భావించి హత్యకు ప్లాన్‌‌ చేశాడు.

 ఇందులో భాగంగా ఆదివారం రాత్రి భాగ్యమ్మకు మద్యం తాగించిన అనంతరం గొంతు నులిమి హత్య చేశాడు. సోమవారం ఉదయం కుటుంబ సభ్యులు గమనించడంతో మద్యం తాగి చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశాడు. అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు గట్టిగా నిలదీయడంతో తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.