కళాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి : బీసీ నేత జాజుల శ్రీనివాస్ గౌడ్

కళాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి :  బీసీ నేత జాజుల శ్రీనివాస్ గౌడ్
  •     బీసీ నేత జాజుల డిమాండ్

హైదరాబాద్, వెలుగు: ఆటపాటలతో తెలంగాణ ఉద్యమాన్ని పల్లెపల్లెకు తీసుకెళ్లిన కళాకారులకు తెలంగాణ సారధిలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని బీసీ భవన్‌లో తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం సమావేశం జరిగింది. 

ఈ సందర్భంగా ఈ నెల 20న చేపట్టనున్న 'చలో హైదరాబాద్, కళాకారుల పోరు దీక్ష' వాల్ పోస్టర్‌ను జాజుల ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలతోనే తెలంగాణ ఉద్యమం పల్లెలకు పాకిందన్నారు.  రాష్ట్రం ఏర్పడ్డాక అలాంటి వందలాది మంది కళాకారుల జీవితాలు రోడ్డున పడ్డాయని.. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని చెప్పారు.  కళాకారులకు తెలంగాణ సారధిలో ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉన్నప్పటికీ తన బాధ్యతను విస్మరిస్తున్నదని మండిపడ్డారు. 

సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు తక్షణమే జోక్యం చేసుకొని నిరుద్యోగ కళాకారులను ఆదుకోవాలని కోరారు. లేకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని జాజుల హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం వ్యవస్థాపకుడు అనుమోజు వెంకటేశం మాట్లాడుతూ.. కళాకారుల హక్కుల కోసం ఈ నెల 20వ తేదీన ఇంద్ర పార్క్‌లో 'కళాకారుల పోరు దీక్ష' చేపడతామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ కళాకారులు భారీగా హాజరు కావాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో జువాజి ప్రవీణ్, కొండ్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.