బ్రాండెడ్ కంపెనీ పేరుతో నకిలీ మందుల దందా.. కుత్బుల్లాపూర్‌‌ లో ఫేక్ లెవిపిల్ 500 సీజ్

బ్రాండెడ్ కంపెనీ పేరుతో నకిలీ మందుల దందా.. కుత్బుల్లాపూర్‌‌ లో ఫేక్  లెవిపిల్ 500 సీజ్
  • క్యూఆర్  కోడ్, ప్యాకింగ్​లో తేడాలతో బయటపడ్డ బాగోతం
  • మెడికల్ షాపు నిర్వాహకుడి అరెస్టు

హైదరాబాద్, వెలుగు: ఒకటే పేరు, ఒకటే ధర. చూడడానికి అచ్చం బ్రాండెడ్  కంపెనీకి చెందిన మందులాగే కనిపించింది. కానీ, క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆ మందు అసలు రూపం బయటపడింది. అచ్చం ఒరిజినల్  మందులనే పోలిన నకిలీ మందులను అమ్ముతూ జనం ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఓ మెడికల్  షాపు నిర్వాహకుడిని డ్రగ్  కంట్రోల్  అథారిటీ (డీసీఏ) అధికారులు పట్టుకున్నారు. కుత్బుల్లాపూర్‌‌  పరిధిలోని చింతల్, సుదర్శన్ రెడ్డి నగర్‌‌ లోని దుర్గా మెడికల్ అండ్  జనరల్  స్టోర్లలో డీసీఏ అధికారులు సోమవారం ఆకస్మిక సోదాలు నిర్వహించారు. 

ఈ సోదాల్లో కుత్బుల్లాపూర్  డీఐ తిరుపతి, మల్కాజిగిరి డీఐ మురళీ కృష్ణ, గాజులరామారం డీఐ శ్రీకాంత్ పాల్గొన్నారు. షాపులో ఉన్న మూర్చవ్యాధి నివారణకు వాడే  లెవిపిల్ 500 టాబ్లెట్లపై అధికారులకు అనుమానం రావడంతో వాటిని క్షుణ్ణంగా పరిశీలించారు.  బ్రాండెడ్  ముసుగులో నకిలీ మందులు అమ్ముతున్న షాపు నిర్వాహకుడు మల్లికార్జున్  నుంచి 4 స్ట్రిప్స్  మందులను సీజ్ చేశారు. సీజ్  చేసిన మందులను అసలైన తయారీ కంపెనీ అయిన సన్  ఫార్మాకు వెరిఫికేషన్  కోసం పంపగా.. అవి పూర్తిగా నకిలీవని రిపోర్ట్  వచ్చింది.

ఒరిజినల్  మందులకు, అక్కడ దొరికిన మందులకు పొంతన లేదని తేలింది. ఒరిజినల్  స్ట్రిప్  వైట్ కలర్‌‌ లో ఉండగా, ఆ మెడికల్  షాపులో దొరికిన నకిలీ స్ట్రిప్ పసుపు రంగులో ఉంది. స్ట్రిప్‌‌ పై ఉన్న క్యూఆర్  కోడ్ ను స్కాన్  చేస్తే.. అది కాపీ చేసిన కోడ్‌‌ గా చూపిస్తోందని అధికారులు గుర్తించారు. స్ట్రిప్  మీద ముద్రించిన అక్షరాల సైజులు, అడ్రస్‌‌ లో కామాలు కూడా సరిగా లేవని రిపోర్ట్‌‌లో తేలింది. అసోంకి చెందిన సన్ ఫార్మా లేబొరేటరీస్  లిమిటెడ్  పేరుతో ఈ నకిలీ మందులను తయారు చేసి మార్కెట్లోకి వదిలినట్లు గుర్తించారు. తదుపరి చర్యల కోసం మేడ్చల్  కోర్టుకు తరలిస్తామని డ్రగ్  ఇన్‌‌ స్పెక్టర్ తిరుపతి తెలిపారు.