ఐమ్యాక్స్ దగ్గర గ్రాండ్ గా సంక్రాంతి వేడుకలు

ఐమ్యాక్స్ దగ్గర గ్రాండ్ గా సంక్రాంతి వేడుకలు
  • హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  • ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో నిర్వహణ

ట్యాంక్ బండ్, వెలుగు: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను అద్దం పట్టేలా ఐమ్యాక్స్ వద్ద సంక్రాంతి సంబురాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మాజీ మంత్రి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో సోమవారం ఐమ్యాక్స్ పక్కన ఉన్న హెచ్ఎండీఏ గ్రౌండ్స్​లో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో వందలాది మంది మహిళలు, యువతులు పాల్గొన్నారు. పండుగ సంస్కృతి, సంప్రదాయాలను గుర్తు చేస్తూ వారు వేసిన రంగవల్లులు చూపరులను ఆకట్టుకున్నాయి. 

అనంతరం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, దానం నాగేందర్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, దైవజ్ఞ శర్మ ముగ్గులను పరిశీలించి విజేతలకు బహుమతులను అందజేశారు. మొదటి బహుమతిగా రూ.51 వేలు, రెండు, మూడో బహుమతులుగా 21 వేలను అందించారు. మరో10 మందికి ఐదు వేల చొప్పున కన్సల్టెంట్ బహుమతులు ఇచ్చారు. 

అనంతరం డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడారు. మహిళలందరిని ఒకచోటకు తీసుకొచ్చి ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు.  రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జరిగిన హరిదాసుల, గంగిరెద్దుల విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.