డ్రగ్స్, గంజాయి కేసుల్లోనే ఎక్కువ మంది జైలుకు..ఆ తర్వాతి స్థానాల్లో పోక్సో, సైబర్ నేరగాళ్లు

 డ్రగ్స్, గంజాయి కేసుల్లోనే ఎక్కువ మంది జైలుకు..ఆ తర్వాతి  స్థానాల్లో పోక్సో, సైబర్ నేరగాళ్లు
  • 2025లో 42,566 మందికటకటాల్లోకి
  • 2024తో పోలిస్తే 11.8 శాతం పెరుగుదల
  • వీరిలో 36,627 మంది అండర్ ట్రయల్స్ ఖైదీలే
  • 2025 వార్షిక నివేదిక రిలీజ్ చేసిన జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: డ్రగ్స్, గంజాయి, సైబర్ నేరగాళ్లతో జైళ్లు నిండిపోతున్నాయి. కొత్తగా పోక్సో కేసుల్లో జైలుకు వచ్చేవారి సంఖ్య పెరుగుతున్నది. చంచల్‌‌‌‌గూడ, చర్లపల్లి సెంట్రల్‌‌‌‌ జైళ్లు సహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జైళ్లకు 2024లో మొత్తం 38,079 ఖైదీలు రాగా, 2025లో ఈ సంఖ్య 42,566కు చేరింది. అంటే అడ్మిషన్ల సంఖ్య 11.8 శాతం పెరిగింది. వీరిలో 2,880 మంది (6.76 శాతం) మహిళలు ఉన్నారు. ఈ మేరకు జైళ్లశాఖకు సంబంధించిన 2025 వార్షిక నివేదికను ఆ శాఖ డీజీ సౌమ్యమిశ్రా సోమవారం విడుదల చేశారు. చంచల్‌‌‌‌గూడలోని స్టేట్‌‌‌‌ ఇన్​స్టిట్యూట్ ఆఫ్‌‌‌‌ కరెక్షనల్‌‌‌‌ అడ్మినిస్ట్రేషన్‌‌‌‌(సికా)లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. ఐజీలు మురళీబాబు, రాజేశ్‌‌‌‌, డీఐజీలు శ్రీనివాస్‌‌‌‌, సంపత్‌‌‌‌తో కలిసి ఆమె మాట్లాడారు. దేశంలోని జైళ్ల శాఖలో సంస్కరణతో మంచి ఫలితాలు వచ్చాయని, మళ్లీ మళ్లీ  జైళ్లకు వచ్చే వారి సంఖ్య తగ్గిందని తెలిపారు. జైలు కొచ్చే వీఐపీలకు కూడా జైల్‌‌‌‌ మ్యాన్యువల్‌‌‌‌, కోర్టు ఆదేశాల మేరకే చర్యలు ఉంటాయని తెలిపారు.

ఈ కేసుల్లోనే ఎక్కువమంది.. 

రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి, సైబర్ నేరాలను, చిన్నారులపై లైంగికవేధింపులు, దాడులను సర్కారు సీరియస్​గా తీసుకుంటున్నది. ఈక్రమంలో ఆయా కేసుల విచారణను పోలీసులు స్పీడప్ ​చేస్తూ, నిందితులను చట్టం ముందు నిలబెడ్తుండంతో ఆయా విభాగాల్లో జైళ్లకు వెళ్లేవారి సంఖ్య పెరుగుతున్నదని అధికారులు చెప్తున్నారు. గతేడాది డిసెంబర్ 31 వరకు డ్రగ్స్, గంజాయి కేసుల్లో 7,040 మంది జైలుకు రాగా, వీరిలో 308 మంది మహిళలు ఉన్నారు.


చిన్నారులపై లైంగిక వేధింపులు, దాడుల (పోక్సో) కేసుల్లో 4,176 మంది జైలుకు రాగా, వీరిలో 109 మంది మహిళలున్నారు. ఇక సైబర్ నేరాల్లో 1,784 మంది జైలుకు రాగా, 109 మంది మహిళలున్నారు. కాగా, సైబర్​ నేరాల్లో పట్టుబడినవారి సంఖ్య ఏకంగా 135.60 శాతం పెరిగింది. మరోవైపు 2025లో జైళ్లకు వచ్చినవారిలో 36,627 మంది అండర్ ట్రయల్సే (విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలే) కావడం గమనార్హం.

301 మందికి పెరోల్‌‌, 6,573 మందికి న్యాయసహాయం

జైళ్లలో శిక్షలు అనుభవిస్తున్న ఖైదీలో మార్పు తేవడంతో పాటు వారికి ఉపాధి అవకాశాలు చూపేలా అధునాతన సంస్కరణలు తీసుకొచ్చామని అధికారులు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జైళ్లలో పరిమితికి లోబడి ఖైదీల సంఖ్య ఉందన్నారు. మొదటిసారి నేరం చేసి జైలుకొచ్చిన వారు 40,090 మంది ఉండగా.. మళ్లీ.. మళ్లీ నేరాలు చేసిన వారు 2,496 మంది జైలులో అడ్మిట్‌‌ అయినట్లు తెలిపారు. వరంగల్‌‌ జైలులో మాత్రమే ఓవర్ క్రౌడ్ ఉందని పేర్కొన్నారు. వీలైనంత త్వరలోనే ఓవర్ క్రౌడ్‌‌ను తగ్గించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. లీగల్ ఎయిడ్ సర్వీస్ ద్వారా 6,573 మందికి న్యాయ సహాయం అందించామని తెలిపారు. ఇందులో 3,634 మంది జైలు నుంచి విడుదల అయ్యారని పేర్కొన్నారు. 301 మంది పెరోల్‌‌ ఇచ్చామని చెప్పారు. జైళ్లను పూర్తిగా సీసీ టీవీ కెమెరాల నిఘా నీడలోకి తెచ్చామన్నారు. సీసీటీవీ కెమెరాలను జైల్‌‌ భవన్‌‌లోని కమాండ్‌‌ కంట్రోల్ సెంటర్‌‌‌‌కు అనుసంధానం చేశామని తెలిపారు.

ఖైదీల ఆరోగ్యంపై హెల్త్‌‌ రికార్డ్స్‌‌

ఖైదీల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. భోజన సదుపాయాలతో పాటు అధునాత వైద్యశాలలు ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. ప్రతి ఖైదీకి సంబంధించిన హెల్త్‌‌ రికార్డులను తయారు చేశామన్నారు. 891 మంది ఖైదీలు ఫిట్స్‌‌, 1,225 మందికి బీపీ, 1,461 మంది డయబెటిస్‌‌, ఇద్దరు కిడ్నీ డయాలసిస్‌‌తో బాధపడుతున్నట్లు తెలిపారు. 56 మందికి మూత్ర పిండాల్లో రాళ్లను తొలగింపు ఆపరేషన్లు, 17 మంది మహిళా ఖైదీలకు ప్రభుత్వ హాస్పిటల్స్‌‌లో డెలివరీలు చేయించామన్నారు. మద్యం, డ్రగ్స్‌‌కు బానిసలైన వారిలో మార్పు తెచ్చేందుకు చర్లపల్లి, చంచల్‌‌గూడ, సంగారెడ్డి, నిజామాబాద్‌‌ జైళ్ల ఆధ్వర్యంలో నివృత్తి డీ అడిక్షన్‌‌ సెంటర్లు నిర్వహిస్తున్నామని తెలిపారు.

15,788 మంది ఖైదీలకు రూ.1.64 కోట్ల దినసరి కూలి

ఖైదీల్లో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందిస్తున్నామని అధికారులు తెలిపారు. పెట్రోల్ బంకులు సహా జైలు ఉత్పత్తులు కేవలం ఖైదీల్లో మార్పు, ఉపాధి అవకాశాల కోసమేనని చెప్పారు. ఇందులో భాగంగా అన్ని జైళ్లలో 28 రకాల పనులకు సంబంధించి 4,615 మందికి శిక్షణ ఇచ్చామని తెలిపారు. జైలు ఉత్పత్తులకు సంబంధించి 15,788 మంది ఖైదీలకు రూ.1.64 కోట్లు చెల్లించామని డీజీ సౌమ్యమిశ్రా వెల్లడించారు. శిక్షలు అనుభవిస్తున్న ఖైదీలతో పాటు విడుదలైన ఖైదీలకు ఉపాధి కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకుగాను రాష్ట్ర వ్యాప్తంగా 32 పెట్రోల్‌‌ బంకులు నిర్వహిస్తుండగా అందులో పనిచేస్తున్న 212 మంది ఖైదీలకు రూ.3.79 కోట్లు జీతాలు చెల్లించినట్లు తెలిపారు.