నేను ధైర్యంగానే ఉన్న.. టెన్షన్ పడొద్దు : కవిత

నేను ధైర్యంగానే ఉన్న.. టెన్షన్ పడొద్దు : కవిత
  • కవితను కలిసిన తల్లి శోభ, కేటీఆర్
  • చూసుకోగానే కొంత ఎమోషనల్ అయిన తల్లీబిడ్డలు
  • త్వరలోనే బయటకు వస్తానని భరోసా
  • ఈడీ కస్టడీలో ఐదో రోజు
  • నేడు సుప్రీం ముందుకు కవిత పిటిషన్

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాం మనీ లాండరింగ్ కేసులో ఈడీ కస్టడీలో ఉన్న కవితను ఆమె తల్లి శోభ కలిశారు. తాను ధైర్యంగా ఉన్నానని టెన్షన్ పడొద్దని ఈ సందర్భంగా తల్లితో చెప్పినట్టు తెలిపింది. తానేమి తప్పుచేయలేదని, ఇదంతా ఫ్యాబ్రికేటెడ్ కేసు అన్నట్లు సమాచారం. తన గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. సీబీఐ స్పెషల్ కోర్టు ఆదేశాలతో ఐదో రోజు ఈడీ కస్టడీలో ఉన్న కవితను తొలిసారి ఆమె తల్లి శోభ.. కేటీఆర్, సోదరి సౌమ్య(సంతోష్ సోదరి), లాయర్ మోహిత్ రావు కలిశారు.

తొలుత 40 నిమిషాల పాటు కుటుంబ సభ్యులు కవితతో మాట్లాడారు. తర్వాత కేటీఆర్, అడ్వకేట్ మోహిత్ 15 నిమిషాలు చర్చించారు. తల్లి, కూతురు ఒకరిని ఒకరు చూసుకోగానే... ఇద్దరు కొంత ఎమోషనల్​అయినట్టు తెలిసింది. ఈ సందర్భంగా కవిత తల్లి శోభకు ధైర్యం చెప్పారు. త్వరలోనే బయటకు వస్తానని అధైర్య పడొద్దని భరోసా ఇచ్చారు. అమ్మ, పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని సౌమ్యకు కవిత చెప్పారు.

తర్వాత రోజువారి విచారణపై కేటీఆర్, లాయర్ మోహిత్ ఆరా తీశారు. నేడు సుప్రీంకోర్టు ముందుకు కవిత పిటిషన్ విచారణకు రానున్న నేపథ్యంలో.. కవిత తరఫున వాదించేందుకు అడ్వకేట్ మోహిత్ పలు ఆమె నుంచి పలు వివరాలను నోట్ చేసుకున్నట్లు తెలిసింది. కస్టడీలోని కీలక విషయాలపై అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. అలాగే కేజ్రీవాల్ అరెస్ట్ కు సంబంధించిన విషయాలు ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్లు తెలిసింది.

ఐదో రోజు కాస్త డిస్టర్బ్​గా

ఐదో రోజు కస్టడీలో కవిత కాస్తా డిస్టర్బ్​గా ఉన్నట్లు తెలిసింది. ఏకాదశి ఉపవాసం, పుస్తకాలతో కుస్తీ కారణంగా నిద్రలేక ఇబ్బంది పడినట్లు సమాచారం. అయితే ఎంక్వైరీలో మాత్రం ఈడీ అధికారులకు పూర్తిగా సహకరించారు. రూ.100 కోట్ల ముడుపుల వ్యవహారం, సౌత్ గ్రూప్ సభ్యుల పాత్ర, ఆప్ నేతలతో మంతనాలపై సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. అలాగే పలు ప్రశ్నలను తొసిపుచ్చినట్లు సమాచారం.

పొలిటికల్ అజెండాతో ఈడీ పనిచేస్తున్నది

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ అరెస్ట్, కస్టడీ ఉత్తర్వులను సవాల్ చేస్తు కవిత దాఖలు చేసిన పిటిషన్ శుక్రవారం సుప్రీంకోర్టు ముందుకు రానుంది. తన అరెస్ట్ అక్రమమని, రిమాండ్ ఉత్తర్వులు రద్దు చేయాలని మొత్తం 537 పేజీలతో కూడిన పిటిషన్ దాఖలు చేశారు. కేంద్ర ప్రభుత్వం చేతిలో ఈడీ కీలు బొమ్మగా మారిందని ఆరోపించారు. పొలిటికల్ అజెండాతో ఈడీ అధికారులు పని చేస్తున్నారని పిటిషన్ లో ప్రస్తావించారు.

సుప్రీంకోర్టులో గత పిటిషన్ పెండింగ్ లో ఉండగానే సోదాల పేరుతో హైదరాబాద్ లోని తన నివాసంలోకి వచ్చిన ఈడీ అధికారులు అక్రమంగా తనను అరెస్టు చేశారని పేర్కొన్నారు. ఈడీ కస్టడీ విధింపు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 21, 22(1) &(2) ప్రకారం విరుద్ధమని పేర్కొన్నారు. తాజా పిటిషన్ పై తుది తీర్పు వెలువడే వరకు పలు షరతులు విధిస్తూ... కవితను విడుదల చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.