- చక్రం తిప్పిన కేటీఆర్
- ఫలితమివ్వని కేకే ఒంటరి పోరాటం
- బకాయిల చెల్లింపులు సహా కార్మికులకు పని కల్పించినా ..
- ఓట్ల రూపంలోకి మల్చుకోలేకపోయిన కాంగ్రెస్
రాజన్నసిరిసిల్ల, వెలుగు : సిరిసిల్ల మున్సిపల్ పీఠం బీఆర్‌ఎస్ ఖాతాలో పడింది. అభ్యర్థుల ఎంపిక నుంచి మొదలుకొని ప్రచారం వరకు.. అంతా తానై వ్యవహరించిన కేటీఆర్ వ్యూహం ఫలించింది. నేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు చెల్లించడంతో పాటు ఏడాదంతా పని కల్పించినా.. దానిని కాంగ్రెస్ లీడర్లు ఓట్ల రూపంలోకి మార్చుకోలేకపోయారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి ఒంటరిపోరు చేసినా ఫలితం దక్కలేదు.
27 స్థానాల్లో బీఆర్‌ఎస్ విజయం
సిరిసిల్ల మున్సిపాలిటీలో మొత్తం 39 వార్డులు ఉన్నాయి. ఇందులో 27 స్థానాలను బీఆర్‌ఎస్ గెలుచుకోగా.. కేవలం ఆరు స్థానాలు మాత్రమే కాంగ్రెస్‌కు దక్కాయి. ఇక బీజేపీ ఐదు స్థానాల్లో విజయం సాధించగా ఒక వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. దీంతో సిరిసిల్ల మున్సిపల్ పీఠం బీఆర్‌ఎస్ ఖాతాలో చేరినట్లైంది.
9 రోజులు సిరిసిల్లలో కేటీఆర్ మకాం
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తన సొంత నియోజకవర్గంలోని మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదిపారు. మూడు దఫాలుగా మొత్తం తొమ్మిది రోజులు సిరిసిల్లలోనే మకాం వేశారు. ఒక్కో వార్డు వారీగా మొత్తం 39 వార్డుల్లో రివ్యూ చేయడంతో పాటు ఆశావహులతో స్వయంగా మాట్లాడారు.
ఒక్కరికి టికెట్ కన్ఫర్మ్ చేశాక.. మిగతా వారిని బుజ్జగించి రెబల్స్ పోటీలో ఉండకుండా జాగ్రత్తపడ్డారు. కాండిడేట్స్ సెలక్షన్స్ నుంచి మొదలుకొని ప్రచారం వరకు స్వయంగా పర్యవేక్షించారు. మొత్తం 30 వార్డుల్లో అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. దీంతో కేటీఆర్ వ్యూహం ఫలించింది.
ఫలితమివ్వని బకాయిల విడుదల.. కేకే ఒంటరి పోరు
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గత ప్రభుత్వం సిరిసిల్ల నేత కార్మికులకు పెండింగ్‌లో పెట్టిన బతుకమ్మ చీరల బకాయిలు రూ.370 కోట్లను విడుదల చేశారు. అలాగే మరో రూ.370 కోట్ల విలువైన ఆర్డర్ ఇవ్వడంతో పాటు కార్మికులకు ఏడాది పొడవునా పనులు కల్పించేందుకు చర్యలు చేపట్టింది. గడిచిన రెండేండ్లలో సిరిసిల్ల నేతన్నలకు వివిధ బకాయిల కింద సుమారు రూ. 1000 కోట్లు ఇచ్చింది. అయినా కార్మికులు బీఆర్‌ఎస్ వైపే మొగ్గు చూపారు. సిరిసిల్ల కాంగ్రెస్‌లో చేరికలు లేకపోవడం, నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి ఒంటరి పోరాటం, ఎన్నికల ప్రచారానికి స్టార్ క్యాంపెయినర్ లేకపోవడం వంటి కారణాలు కాంగ్రెస్ ఓటమికి కారణమన్న అభిప్రాయాలు
వినిపిస్తున్నాయి.
