కాంగ్రెస్ మూడు చోట్ల డమ్మీ అభ్యర్థులను పెట్టింది:కేటీఆర్

కాంగ్రెస్ మూడు చోట్ల డమ్మీ అభ్యర్థులను పెట్టింది:కేటీఆర్

కరీంనగర్, కోరుట్ల,  గోషామహల్ లో  కాంగ్రెస్  డమ్మీ అభ్యర్థులను పెట్టిందని మంత్రి కేటిఆర్ అన్నారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించేందుకే  ఈ మూడు చోట్ల కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టిందని.. గోహామహల్ లో బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ ను ఓడిస్తామని కేటీఆర్ అన్నారు. 2023, నవంబర్ 26వ తేదీ ఆదివారం తెలంగాణ భవన్ లో మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రైతుబంధు ఇవ్వదంటూ రేవంత్ రెడ్డి, రైతుల పట్ల మరోసారి తన అక్కసును చూపించాడని విమర్శించారు. రైతుబంధు కొత్త  పథకం కాదని.. 2018 ఎన్నికలకు ముందు నుంచి రైతు బంధు కొనసాగుతోంది. కొన్నేళ్లుగా కొనసాగుతున్న పథకాలకు ఎన్నికల కోడ్ వర్తించదని చెప్పారు.  కేసీఆర్ పోరాటం వల్లే కాంగ్రెస్ అధిష్ఠానం దిగొచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని కేటీఆర్ అన్నారు. ఢిల్లీ మెడలు వంచి మరీ కేసీఆర్ తెలంగాణ సాధించారన్నారు.

 స్పష్టమైన లక్ష్యంతో పార్టీ పెట్టి విజయం సాధించారని అన్నారు. 14ఏళ్లుగా నవంబర్ 29న దీక్షా దివస్ జరుపుకుంటున్నామని... తెలంగాణ జాతిని ఏకం చేసిన రోజు నవంబర్ 29 అన్నారు.  ఆ రోజే మహోద్యమానికి బీజం పడిందని నవంబర్ 29న తెలంగాణ ప్రజలంతా దీక్షా దివస్ జరుపుకోవాలని చెప్పారు. నవంబర్ 29న బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా  సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కేటీఆర్ కోరారు.